ప్రముఖ తెలుగు సినీ సీనియర్ నటుడు రాళ్లపల్లి(73) ఇకలేరు. గతకొంత కాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారాయన. ఈ రోజు సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. 1979లో ‘ కుక్కకాటుకు చెప్పుదెబ్బ’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారాయన.
శ్రీవారికి ప్రేమలేఖ, శుభలేఖ, ఖైదీ, న్యాయానికి సంకెళ్లు, ఆలయశిఖరం, మంత్రిగారి వియ్యంకుడు, అభిలాష, సితార, ఆలాపన, ఏప్రిల్ 1 విడుదల, సూర్య, ఐపీఎస్, దొంగపోలీసు, కన్నయ్య కిట్టయ్య వంటి చిత్రాల్లో నటించారు. ఎక్కువగా ఆయన హాస్యరస ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగులో 850కి పైగా చిత్రాల్లో నటించారు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా రంగంలో కొనసాగారు. రాళ్లపల్లి పూర్తిపేరు రాళ్లపల్లి వేంకట నరసింహారావు. 1955 అక్టోబర్ 10న తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో జన్మించారు. విద్యార్థి దశ నుంచే ఆయన నాటకాల్లో నటించారు. అలా నాటకాల నుంచి 1979లో సినీరంగంలోకి ప్రవేశించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని మోతీ నగర్లో నివాసం వుంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు వున్నారు. ఒక కుమార్తె అమెరికాలో వుంటున్నారు.