అల్లు అర్జున్ అంటే ఎవరో తెలియదంటున్న తెలుగు హీరోయిన్ - MicTv.in - Telugu News
mictv telugu

అల్లు అర్జున్ అంటే ఎవరో తెలియదంటున్న తెలుగు హీరోయిన్

November 30, 2022

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయింది. అందులో తగ్గేదే లే అనే డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. మొదటి భాగం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ప్రస్తుతం రెండో భాగం తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే అలనాటి నటి, నర్తకి ఎల్ విజయలక్ష్మి పుష్ప సినిమా గురించి, అందులో హీరో అల్లు అర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ అవార్డు అందుకోవడానికి ఇండియా వచ్చిన ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఈ మధ్య ఏమైనా సినిమాలు చూశారా? అనే ప్రశ్నకు పుష్ప చూశానని బదులిచ్చింది. అందులో హీరో ఎవరో తెలుసుగా అనేలోపు తెలియదని సమాధానమిచ్చింది. హీరో అల్లు రామలింగయ్య గారి మనవడు అనగానే ఆశ్చర్యపోయిన నటి.. ఈ మధ్యకాలంలో హీరోల గురించి అడుగుతుంటే నాగేశ్వరరావు మనవడు, రామానాయుడు మనవడు, ఎన్టీఆర్ మనవడు అని చెప్తున్నారని పేర్కొంది.

కాగా, సోదరుడి స్నేహితుడైన సైంటిస్టును వివాహం చేసుకున్న విజయలక్ష్మి తర్వాత భర్తతో కలిసి ఫిలిప్పీన్స్ వెళ్లిపోయారు. అక్కడ అందరూ పీహెచ్డీలు చేసిన వారు తాను ఒక్కతే సినిమా రంగం నుంచి వెళ్లినవారు కావడంతో చదువుపై ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో వ్యవసాయంలో ఉన్నత విద్యను అభ్యసించి తర్వాత అమెరికా వెళ్లిపోయారు. అక్కడ అకౌంటింగ్ పై పట్టు సాధించి సీఏను పూర్తి చేశారు. అక్కడ సీఏను సీపీఏగా పిలుస్తారు. ఆ అర్హతతో వర్జీనియా యూనివర్సిటీలో అకౌంటెంట్ గా జాబ్ సంపాదించారు. తర్వాత బడ్జెట్ ప్లానర్ గా మారి ఫైనాన్స్ అనలిస్టుగా సేవలందించారు. ఇలా 17 ఏళ్లు ఒకే యూనివర్సిటీలో పని చేసిన అనంతరం ప్రస్తుతానికి తమిళనాడులో సెటిల్ అయ్యారు. ఈమె కొడుకు సిలికాన్ వ్యాలీలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ నడుపుతున్నారు. ఇదిలా ఉంటే ఏ స్టార్ హీరోయిన్ కూడా సినిమాల తర్వాత ఇంతలా చదివి ఉద్యోగం చేసిన దాఖలాలు లేవనడంలో అతిశయోక్తి లేదు.