ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర సంక్షోభ పరిస్థితి నెలకొంది. పార్టీలో జంబో కమిటీల ప్రకటనతో మొదలైన అసంతృప్తి.. పార్టీని పీసీసీ, సీఎల్పీ వర్గాలుగా చీల్చింది. ముందు నుంచి ఉన్నవారికి కాదని, వేరే పార్టీల నుంచి వచ్చిన వలసవాదులకే పదవులు దక్కాయని పలువురు సీనియర్లు ఆరోపిస్తున్నారు. జెండా మోసిన వాళ్లకే అన్యాయం జరిగిందంటూ రచ్చకెక్కిన ఈ వివాదాన్ని పార్టీ అధిష్ఠానం చక్కదిద్దే చర్యలు చేపట్టింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న వివాదాల పరిష్కరించే బాధ్యతను రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్‌కు అప్పజెప్పుతూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సీనియర్లలో అసంతృప్తిని చల్లార్చేప్రయత్నాలు చేపట్టారు దిగ్విజయ్ సింగ్. అసమ్మతి నేతలకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు.
అసంతృప్తివర్గంలో ఒకరైన మహేశ్వర్‌రెడ్డికి దిగ్విజయ్‌సింగ్ మంగళవారం ఫోన్ చేశారు. తాజా పరిణామాల గురించి తెలుసుకున్న ఆయన.. సమస్యలపై చర్చిస్తానని హామీ ఇచ్చారట. ముందుగా సాయంత్రం జరపాలని నిర్ణయించిన సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని మహేశ్వరెడ్డికి సూచించారని తెలిసింది. అందుకు ఒకే చెప్పిన మహేశ్వర్ రెడ్డి… త్వరలోనే దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్‌కు వస్తున్నారని, పార్టీ నేతలతో ఆయన భేటీ కానున్నారని మిగతా కాంగ్రెస్ వర్గీయులకు తెలిపారు. సమస్యను పరిష్కరిస్తామని దిగ్విజయ్ చెప్పారని పేర్కొన్నారు.
కాగా ముందస్తు నిర్ణయం ప్రకారం మంగళవారం సాయంత్రం మహేశ్వర్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ సీనియర్లు భేటీకావాల్సి ఉంది. అయితే దిగ్విజయ్ సింగ్ ఫోన్‌తో వారు వెనక్కి తగ్గారు. తాజా పరిణామాల నేపథ్యంలో సాయంత్రం జరగాల్సిన కాంగ్రెస్ సీనియర్ల సమావేశం వాయిదా పడింది. మరోవైపు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో మహేష్ గౌడ్, కోదండరెడ్డి భేటీ అయ్యారు. సాయంత్రం సీనియర్ల సమావేశం వాయిదా వేయాలని కోరారు.