రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభానికి తెరదించేందుకు.. అధిష్టానం ఆదేశాలతో సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ (డిగ్గీ రాజా) అసంతృప్తి నేతలతో మరికాసేపట్లో సమావేశం కానున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ వచ్చిన ఆయన… ఈ ఉదయం గాంధీభవన్‌లో పీసీసీ వ్యతిరేకవర్గ సీనియర్లతో ఒక్కొక్కరితో వేర్వేరుగా సమావేశమై… సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మరో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దిల్లీలో ఉండడంతో.. సీఎల్పీ నేతలు మల్లు భట్టి విక్రమార్క సహా ఎమ్మెల్యే జగ్గారెడ్డి, దామోదర, మధుయాష్కీతో.. చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో లోటుపాట్లపై ఆరా తీయనున్నారు. పార్టీలో ఉత్పన్నమవుతున్న సమస్యలకు పరిష్కారం, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించనున్నారు.
ఇటీవల పార్టీ పదవులకు రాజీనామా చేసిన ఎమ్మెల్యే సీతక్క సహా విజయరమణారావు, వేం నరేందర్‌రెడ్డి తదితరులతో కూడా దిగ్విజయ్ సింగ్ సమావేశం కానున్నారని సమాచారం. తర్వాత పీసీసీ అధ్యక్షుడితో, ఇన్‌ఛార్జి మాణికంఠాగూర్‌తో కూడా చర్చించి అధిష్ఠానానికి నివేదిక ఇస్తారని తెలుస్తోంది. నాయకులంతా ఏకతాటిపై నడిచేందుకు ఏం చేస్తే బాగుంటుందని వారి నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశాల అనంతరం సాయంత్రం మీడియాతో మాట్లాడనున్నారు. నిన్న హోటల్లోనే అర్ధరాత్రి వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మరికొంత మంది నేతలతో మాట్లాడారు దిగ్విజయ్.