తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కీలక పోస్టుల్లో మార్పులు చేశారు సీఎం కేసీఆర్. రాష్ట్ర ఇన్చార్జి డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అంజనీకుమార్‌ను నియమించారు. మరో ఆరుగురు ఐపీఎస్‌లను బదిలీ చేశారు. అంజనీ కుమార్ ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ డీజీగా ఉన్నారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌కు సీఐడీ డీజీగా బాధ్యతలు అందుకున్నారు. అవినీతి నిరోధక శాఖ డీజీగా రవి గుప్తా, రాచకొండ కమిషనర్‌గా డీఎస్ చౌహాన్, హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా జితేందర్, శాంతిభద్రతల అదనపు డీజీగా సంజయ్ కుమార్ జైన్లను ప్రభుత్వం నియమించింది.
రవిగుప్తాకు అదనంగా విజిలెన్స్ డీజీ బాధ్యతలు కూడా కట్టబెట్టారు. మహేందర్ రెడ్డి స్థానంలో ఎవరిని నియమించాలన్నదానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అంజనీ కుమార్‌కే ఎక్కువ అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీనియారిటీ జాబితాలో 1989 బ్యాచ్ కు చెందిన ఉమేశ్ షరాఫ్, 1990 బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్, రవి గుప్తా ఉన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ఐదుగురు అధికారులతో కూడిన జాబితాను రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి పంపాలి. యూపీఎస్సీ షార్ట్ లిస్ట్ చేసిన ముగ్గురిలో ఒకరిని డీజీపీగా నియమించాలి. అయితే చాలా రాష్ట్రాల్లో వివాదాలు, కేసులు వల్ల ఈ పద్ధతి అమలుకావడం లేదు.