SENIOR LEADER D SRINIVAS IS CRITICALLY ILL
mictv telugu

Dharmapuri Srinivas:డి.శ్రీనివాస్‎కు తీవ్ర అస్వస్థత..పరిస్థితి విషమం

February 27, 2023

SENIOR LEADER D SRINIVAS IS CRITICALLY ILL

సీనియర్ రాజకీయనేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు..సోమవారం ఉదయం ఫిట్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో హుటాహుటిన సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తండ్రి ఆనారోగ్యానికి గురికావడంతో ఎంపీ అర్వింద్ తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆస్పత్రిలో తండ్రి వద్దనే ఆయన ఉన్నారు. డి.శ్రీనివాస్ ఆస్పత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

డి.శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాల్లో అందరికి డీఎస్‎గా సుపరిచితులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్నారు. 2004, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో తనదైన పాత్ర పోషించారు. 2015, జూలై 2న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. కొద్దికాలానికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. అయితే, 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత టీఆర్ఎస్ అధిష్టానంకు, డీఎస్‌కు మధ్య మనస్పర్థలు రావడంతో పార్టీకి దూరంగా ఉన్నారు.