Home > Featured > 150 మందికి గుండు కొట్టించి.. చదువుకున్నోళ్లే.. 

150 మందికి గుండు కొట్టించి.. చదువుకున్నోళ్లే.. 

గుండు గీయించుకొని లైన్లో నడుస్తూ భక్తిని ప్రదర్శిస్తున్న వీరంతా ఏ గుడికి వెళ్లిన భక్తులు అనుకుంటే పొరపడినట్టే. వీరంతా వైద్య విద్య చదువుతున్న మెడికల్ విద్యార్థులు. ర్యాగింగ్ భూతం కోరలు విప్పడంతో సీనియర్ల వేధింపులకు సుమారు 150 మంది విద్యార్థులు ఇలా గుండు గీయించుకోవాల్సి వచ్చింది. యూపీలో వెలుగు చూసిన ర్యాగింగ్ రక్కసిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సైఫాయ్‌ ప్రాంతంలో ఉన్న యూపీ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సెన్సైస్ కాలేజీలో కొంత మంది సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్‌ చేస్తూ వేధించారు. మొదటి సంవత్సరం చదువుతున్న 150 మంది విద్యార్థులకు గుండు గీయించి వారితో సెల్యూట్ చేయించుకున్నారు. వరుస క్రమంలో నడుస్తూ సీనియర్లందరికి నమస్కారం పెడుతూ ముందుకు వెళ్లిపోయారు. ఇంత జరుగుతున్నా కాలేజీ సిబ్బంది మాత్రం ఏ మాత్రం పట్టించుకోలేదు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు ఏ మాత్రం పట్టనట్టుగా వ్యవహరించాడు. ఈ తతంగం అంతా వీడియో తీయడంతో ఇప్పుడది వైరల్ అయింది.

వీడియో బయటకు రావడంతో వీసీ రాజ్‌కుమార్ స్పందించారు. ర్యాగింగ్ చాలా కాలం నుంచే కాలేజీలో నిషేధించామని వెల్లడించారు. రూల్స్ బ్రేక్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు. వీసీ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా సైఫాయ్‌ యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ సొంత గ్రామం కావడం విశేషం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు.

Updated : 21 Aug 2019 3:20 AM GMT
Tags:    
Next Story
Share it
Top