Sensational decision of UGC..Academic qualifications are not required
mictv telugu

యూజీసీ సంచలన నిర్ణయం..అకడమిక్ క్వాలిఫికేషన్లు అక్కర్లేదు

August 23, 2022

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో అధ్యాపకులుగా విధులు నిర్వహించేందుకు ప్రత్యేక నిపుణుల విషయంలో ఎలాంటి అకడమిక్ క్వాలిఫికేషన్లు అక్కర్లేదని తేల్చి చెప్పింది. గతవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ‘ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్’ అనే పథకాన్ని వచ్చే నెలలో నోటిఫై చేసే అవకాశం ఉందని, ఒక ఉన్నత విద్యాసంస్థకు మంజూరైన మొత్తం ఫ్యాకల్టీ పోస్టుల్లో ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ద్వారా నియమితులైనవారి సంఖ్య ఏ సమయంలోనూ 10 శాతానికి మించకూడదని యూజీసీ నిర్ణయించిందని అధికారులు పేర్కొన్నారు.

పీటీఐ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..”ఆయా రంగాల్లో ఇప్పటికే తమ నైపుణ్యాన్ని నిరూపించుకొన్నవారు లేదా కనీసం 15 ఏండ్ల నుంచి సేవలు అందిస్తున్న అనుభవజ్ఞులు ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్‌కు అర్హులు. అలాంటి వారిని విశ్వవిద్యాలయాల్లో, ఉన్నత విద్యాసంస్థల్లో అధ్యాపకులుగా నియమించుకునే విషయంలో అకడమిక్ క్వాలిఫికేషన్లు అక్కర్లేదు. ఇందులో ముఖ్యంగా సాయుధ బలగాలతోపాటు ఇంజినీరింగ్, సైన్స్, మీడియా, లిటరేచర్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సోషల్ సైన్సెస్, ఫైన్ ఆర్ట్స్, సివిల్ సర్వీసెస్ తదితర రంగాలకు చెందిన నిపుణులను అధ్యాపకులుగా నియమించుకొవచ్చు. అది కూడా 10 శాతానికి మించకూడదు” అని ఆమోదిత ముసాయిదా మార్గదర్శకాల్లో పేర్కొన్నట్టు వార్తా సంస్థ తెలిపింది.