జగన్‌ సింహంలా కనిపిస్తున్నారు : పూరి జగన్నాథ్ - MicTv.in - Telugu News
mictv telugu

జగన్‌ సింహంలా కనిపిస్తున్నారు : పూరి జగన్నాథ్

May 26, 2019

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ప్రముఖ దర్శకుడు పూరి ప్రశంసలు కురిపించారు. మొన్న విడుదలైన ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ 151 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొంది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో జగన్ ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోషల్ మీడియా వేదికగా జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ వల్లే తన సోదరుడు ఉమాశంకర్ గణేశ్ విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడని, ఆయనకు రుణ‌పడి ఉంటానన్నారు.

సోషల్ మీడియాలో పూరి ఏమన్నాడంటే ?  ‘ఎన్నికల ఫలితాలు రోజు నేను వైజాగ్‌లో ఉన్నాను. నా కుటుంబ సభ్యులందరితో కలిసి టీవీ చూస్తున్నాను. నా తమ్ముడు ఉమాశంకర్‌ గణేశ్‌ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. వాడు గెలవడేమో అనుకున్నాను. కానీ వార్ వన్‌సైడ్ అయిపోయింది. జగన్‌కు హ్యాట్సాఫ్‌‌. ఎందుకంటే తండ్రి రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన ఒంటరివాడయ్యారు. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలను తట్టుకుంటూ శక్తిని కూడగట్టుకుని ఈ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించారు. గెలుపు తర్వాత జగన్‌  మీడియాతో మాట్లాడిన వీడియో చూశాను. ఆయన ముఖంలో విజయ గర్వంలేదు. పొగరులేదు. మౌనంగా ఉన్నారు. సేద తీరుతున్నారు. ఏదేమైనా రాజన్న కొడుకు అనిపించుకున్నారు. నా ఉద్దేశంలో దైవ నిర్ణయం కంటే ప్రజా నిర్ణయమే గొప్పది. నా తమ్ముడికి జగన్‌ అంటే ప్రాణం. గత ఎన్నికల్లో వాడు ఓడిపోయినా, మళ్లీ భుజం తట్టి, చెయ్యి పట్టుకుని యుద్ధంలోకి లాక్కెళ్లి ఇంతటి విజయాన్ని వాడికి అందించిన జగన్‌కు నేను, నా కుటుంబం రుణపడి ఉంటాం. నేను రాజకీయాల్లో లేను. కానీ నాకు యోధులంటే ఇష్టం. నాకు జగన్‌ సింహంలా కనిపిస్తున్నారు’ అని పూరి జగన్నాథ్ పేర్కొన్నారు.