కర్ణాటకలోని ఉడుపిలో ఇటీవల సంచలనం రేపిన హిజాబ్ వివాదంపై మంగళవారం హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. హిజాబ్ ధరించడం ఇస్లాం మతానికి అత్యవసరమైన ఆచారం కాదని వెల్లడించింది. విద్యార్థులు ప్రోటోకాల్ పాటించాల్సిందేనంటూ ముగ్గురు సభ్యుల ధర్మాసనం తేల్చిచెప్పింది.
ఈ మేరకు దాఖలైన అన్ని పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. అంతేకాక, ఫిబ్రవరి 5వ తేదీన ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధించింది. కాగా, గత నెలలో ఉడుపిలో విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడంపై ఉద్రిక్తతలు చెలరేగిన విషయం తెలిసిందే. అనంతరం హిజాబ్‌కు అనుమతివ్వాలంటూ కొందరు విద్యార్థినులు హైకోర్టులో పిటిషన్ వేశారు. మొదట ఏకసభ్య ధర్మాసనం కేసును విచారించగా.. తర్వాత త్రిసభ్య ధర్మాసనానికి కేసు బదిలీ చేశారు. నేడు తుది తీర్పు వెలువడగా, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.