Sensational letter..Despite hardships and tears..
mictv telugu

సంచలనం రేపుతున్న లేఖ..’నేను పని చేయలేను’

August 4, 2022

”30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో సుశిక్షితుడైన కార్యకర్తగా, ప్రజాప్రతినిధిగా ఏ పని అప్పగించినా రాజీ పడకుండా పనిచేశాను. కష్టాలు, కన్నీళ్లు దిగమింగుకుంటూ పార్టీ ప్రతిష్ట కోసం, కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రస్థానం సాగించాను. కానీ కొంతకాలంగా పార్టీకి విధేయులైన వారిని అవమానపరుస్తూ, పార్టీ ద్రోహులు, మీపైనే వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించటం తీవ్రంగా బాధించింది. అనేక పార్టీలు మార్చి, స్వలాభం కోసం ఓ ప్రజాప్రతినిధి చేయకూడని పనులు చేసి జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో నేను కలిసి పనిచేయలేను” అని రాజగోపాల్ రెడ్డి సోనియా గాంధీ రాసిన లేఖ ప్రస్తుతం సంచలనంగా మారింది.

గత రెండు రోజులుగా నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కుడి, ఎడమగా పేరుగాంచిన కోమటి రెడ్డి బ్రదర్స్‌లో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఉహించని షాక్ తగిలింది.

ఈ క్రమంలో నేడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు బయటికొచ్చానోనని ఆ వివరాలను తెలియజేస్తూ, ఓ లేఖ రాశారు. ఆ లేఖలో సంచలన విషయాలను వెల్లడించారు. ”అందరి చొరవతో సాకారమైన తెలంగాణ రాష్ట్రం.. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయింది. ఈ బంధీ నుంచి విడిపించేందుకు తెలంగాణాలో మరో ప్రజాస్వామిక పోరాటం అవసరం ఉందని నేను నమ్ముతున్నాను. అనేక జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించలేని వ్యక్తులు, గెలిచిన ఎమ్మెల్యేల్లో మనోధైర్యం నింపి పోరాట కార్యాచరణ రూపొందించలేక కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేశారు” అని కీలక విషయాలను వెల్లడించారు.