కృష్ణా జిల్లా టిడిపి కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఘర్షణల కేసులో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాంతోపాటు మరో 15మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు, వైసీసీ కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు తెలియడంతో పట్టాభిరాం అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలోనే జరిగిన దాడిని నిరసిస్తూ…డిజిపి ఆఫీసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పట్టాభితోపాటు మరికొంతమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పట్టాభిని ఎక్కడికి తరలించారో తెలియకపోవడంతో గందరగోళం పరిస్థితి నెలకొంది. తన భర్త పట్టాభీకి ప్రాణహాని ఉందంటూ ఆయన భార్య ఆందోళనకు దిగింది. ఈ క్రమంలోపోలీసులు ఆయన్ను గన్నవరం కోర్టులో హాజరుపరిచారు.
కోర్టులో న్యాయవాది ముందు పట్టాభిరాం పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చీకటి గదిలో లాక్కెళ్లి చిత్కకొట్టారని..థర్డ్ డిగ్రీ ప్రయోగించారని న్యాయస్థానంలో చెప్పారు. ముఖానికి టవల్ చుట్టి కొట్టారని న్యాయమూర్తికి వెల్లడించారు. అయితే పోలీసులు మాత్రం పట్టాభి తమతో దురుసుగా ప్రవర్తించాడని చెబుతున్నారు. గన్నవరం ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విధులు నిర్వర్తిస్తున్న తనకు హాని కలిగించేలా టీడీపీ నాయకులు ప్రయత్నించారని సీఐ కనకరావు ఫిర్యాదు చేశారు. కాగా పట్టాభితోపాటు మరికొందరు టీడీపీ నాయకులపై అట్రాసిటి హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది.