సంక్రాంతి పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ భారీగా ప్రత్యేక బస్సులను నడుపుతున్న సంగతి తెలిసిందే. పండుగ వేళ సొంతూరు వెళ్లే ప్రయాణికులను త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టీఎస్ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా టోల్‌ప్లాజాల వద్ద టీఎస్ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లేన్ ఏర్పాటు చేయనున్నారు. పండుగ నేపథ్యంలో టోల్‌ప్లాజాల వద్ద భారీగా రద్దీ ఉంటుంది. ఫలితంగా గంటల కొద్ది వేచి ఉండాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యలు ఉండకుండా టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్ ఉండేలా చర్యలు తీసుకుంది టీఎస్ఆర్టీసీ.
టోల్‌ప్లాజాల వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలని కోరుతూ టీఎస్ఆర్టీసీ అధికారులు.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలకు లేఖ రాశారు. దీనికి ఆ రెండు శాఖలు అంగీకరించడంతో.. ప్రత్యేక లేన్ కేటాయించనున్నారు. ఈ నెల10 నుంచి 14వరకు హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-నిజామాబాద్, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-సిద్దిపేట తదితర జాతీయ రహదారుల్లోని టోల్‌ప్లాజాల వద్ద ఈ ప్రత్యేక లేన్ అందుబాటులో ఉంటుందని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ప్రత్యేక బస్సుల పర్యవేక్షణకు హైదరాబాద్‌లోని బస్‌భవన్, ఎంజీబీఎస్ బస్‌స్టేషన్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.