కో ఎడ్యుకేషన్ చాలా సాధారణమైపోయిన ఈ కాలంలో అమ్మాయిలకు, అబ్బాయిలకు మద్య తెర ఏర్పాటు చేసి భద్రంగా పాఠం బోధించారు. అది కూడా ఏ చిన్నచితకా విద్యాలయంలోనో కాదు, మెడికల్ కాలేజీలో. ఈ సపరేట్ డివిజన్ క్లాసు ఫోటోలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కేరళలోని త్రిసూర్ మెడికల్ కాలేజీలో ఈ తతంగం చోటుచేసుకుంది. ముజాహిద్ విజ్డమ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆ కాలేజీలో ఇస్లామ్ మత కోణంలో లింగ సంబంధ అంశాలపై ఓ క్లాసు నిర్వహించింది. స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్ల పట్ల ఎలా మెలాగోలో చెప్పడం వాళ్ల ఉద్దేశం. అయితే క్లాసులో అమ్మాయిలను అబ్బాయిలు, అబ్బాయిలను అమ్మాయిలను చూడకుండా మధ్యలో తెర ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఎవరో సోషల్ మీడియాలో పడేయంతో వివాదం మొదలైంది. సమాజం ఇంత అభివృద్ధి చెందుతున్నాఈ ఛాందసవాదమేమిటని విద్యార్థి సంఘాలు తిట్టిపోస్తున్నాయి. మెడికల్ సైన్స్ చదువుతున్న వాళ్లు కూడా బుద్ధిలేకుండా ఎలా పాఠాలు విన్నారని వామపక్ష విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అయితే తెర కట్టడం తప్పేమీ కాదు ముజాహిద్ విజ్డమ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సమర్థించుకుంటోంది.