ఛార్లెస్ శోభ్‌రాజ్.. గత కొన్ని రోజులుగా మీడియాలో నానుతున్న పేరు. ఇప్పటి తరానికి ఈ పేరు కాస్త వైరెటీగా, స్టైలిష్‌గా అనిపిస్తుందేమో కానీ.. 60,70 దశకాల్లో జీవించిన వారికి మాత్రం హడల్. శోభ్‌రాజ్ అనే పేరు వింటేనే చాలు.. ఒక్కొక్కరి గుండెల్లో దడ మొదలవుద్ది. హ్యాండ్సమ్ లుక్, స్టైలిష్ డ్రెస్, ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగలిగే ఆ రూపం వెనుక.. కరుడు గట్టిన క్రూరమైన స్వభావం ఉందని ఎవరూ ఊహించరు. నమ్మిన్నోళ్లను నట్టేట ముంచుతూ.. నరమేధానికి పాల్పడే ఈ వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకునే సినిమాల్లో ప్రొఫెషనల్ కిల్లర్ల పాత్రలను సృష్టించారంటే అతిశయోక్తి కాదు. హత్యలు, మోసాలు, దోపిడీ ఘటనల్లో ఆయన పేరు అప్పట్లో మారుమోగింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 మంది టూరిస్టులను చంపిన ఈ ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్.. ఒక్క థాయ్లాండ్లోనే 14 మందిని హతమార్చాడు. థాయ్ బాధితుల్లో చాలామంది బికినీలో శవాలుగా కనిపించడంతో అతనికి బికినీ కిల్లర్ అనే ముద్రపడింది.
నేర చరిత్రకు తొలి బీజం..
‘ది సర్పెంట్’, ‘బికినీ కిల్లర్’ వంటి మారుపేర్లతో ప్రసిద్ధి చెందిన చార్లెస్ శోభరాజ్ 1944 ఏప్రిల్ 6న వియత్నాంలోని సైగాన్లో జన్మించారు. తండ్రి భారతీయుడు, తల్లి వియత్నాం పౌరురాలు. శోభరాజ్ చిన్నతనంలోనే వీళ్లిద్దరూ విడిపోవడంతో.. అతని తల్లి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరికి పిల్లలు కలగడంతో, శోభరాజ్‌ని నిర్లక్ష్యం చేశారని, దాంతో ఆయన నేరప్రవృత్తికి అలవాటుపడినట్టు చెబుతారు. తొలిసారిగా ఓ చోరీ కేసులో 1963లో జైలుకు వెళ్లాడు శోభ్‌రాజ్. తన మాయ మాటలతో అక్కడి అధికారులను మచ్చిక చేసుకుని.. సకల భోగాలు అనుభవించాడు. ఆపై ఓ రిచ్ వలంటీర్‌తో పరిచయం పెంచుకున్నాడు. పెరోల్ మీద బయటకు వచ్చి.. పిక్‌పాకెట్ నేరాల నుంచి పెద్ద పెద్ద దందాలతో ప్యారిస్‌లో బడా క్రిమినల్‌గా ఎదిగాడు.
చంపడంలో కూడా స్టైలే..
తినే ఆహరంలో, తాగే వాటిలో డ్రగ్స్, మత్తుమందు కలిపి ఇచ్చి ప్లాన్డ్ గా చంపడం శోభరాజ్ స్టైల్. పలు దేశాల్లో తిరుగుతూ అక్కడికి వచ్చే టూరిస్ట్లే ఇతని టార్గెట్. 1975లో నేపాల్ రాజధాని కఠ్మాండూలో ఇద్దరు అమెరికన్ టూరిస్టులను హత్య చేశాడు. ఆ తర్వాత 1976లో కొందరు కాలేజీ విద్యార్థులపై డ్రగ్స్, విషపు గోళీలతో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే వాళ్లంతా ప్రాణాలతో బయటపడడం.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జులై నెలలో శోభరాజ్ అరెస్ట్ అయ్యాడు. తిహార్ జైల్లో 12 ఏళ్ల జైలు శిక్ష పడింది. మరికొద్ది నెలల్లో శిక్షా కాలం ముగుస్తుందనగా 1986లో జైలు నుంచి తప్పించుకున్నాడు. పుట్టినరోజు వంకతో జైలు హోం గార్డులకు మత్తు మందు కలిపిన స్వీట్లు పంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత భారత్, థాయ్‌లాండ్, నేపాల్, టర్కీ, ఇరాన్లలో 20కి పైగా హత్యలు చేశారని.. బాధితులకు మత్తుమందు ఇవ్వడం, గొంతు కోయడం, కొట్టడం లేదా తగలబెట్టడం వంటి చర్యల ద్వారా హత్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి.
ధైర్యంగా వెళ్లి.. అడ్డంగా బుక్కయ్యాడు
ఈ క్రమంలోనే 2003లో మరోసారి నేపాల్‌కు తిరిగి వెళ్లాడు శోభ్‌రాజ్. పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని తెలిసినా నిర్భయంగా వెళ్లాడు. సుమారు 28 ఏళ్ల కిందటి(1975) కేసును తిరగదోడిన పోలీసులు.. నేపాల్ రాజధాని కఠ్మాండూలోని ఓ క్యాసినోలో ఆయన్ను పట్టుకున్నారు. ఆ కేసులో అమెరికన్ టూరిస్ట్ కొన్నీ జో బ్రోంజిచ్‌ను హత్యచేసినందుకు అతడికి నేపాల్ న్యాయస్థానం 2003లో జీవిత ఖైదును విధించింది. బ్రోంజిచ్ యొక్క కెనడియన్ భాగస్వామిని హత్యచేసినందుకు కూడా శోభరాజ్‌ను దోషిగా కోర్టు నిర్ధారించింది. దీంతో అతనికి మరో 21ఏళ్లు పాటు జైలు శిక్షను న్యాయస్థానం విధించింది.
జీవిత చరిత్రపై సినిమాలు
కానీ 78 ఏళ్ల వయసులో ఆరోగ్యం క్షీణించడం, సత్ప్రవర్తన, దాదాపు శిక్షాకాలం(95 శాతం) పూర్తి చేసుకోవడం కారణాలతో.. నేపాల్ అత్యున్నత న్యాయస్థానం చివరికి.. డిసెంబర్ 21, 2022న విడుదల చేసేందుకు ఓకే చెప్పింది. కానీ, నేపాలీ పోలీసులు మాత్రం అతని విడుదలకు ససేమీరా అంటున్నారు. సుప్రీం కోర్టు ఏ కేసులో అతన్ని విడుదల చేయాలని చెప్పిందో స్పష్టత లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఛార్లెస్ శోభరాజ్ అసలు నేరస్థుడిగా ఎందుకు మారాడు? ఆ నేరాల వెనుక ఉద్దేశం ఏంటన్న దానిపై ఇంతవరకూ.. ఒక క్లారిటీ అంటూ లేకుండా పోయింది. అతని జీవిత కథ ఆధారంగా.. నాలుగు బయోగ్రఫీలు, మూడు డాక్యుమెంటరీలతో పాటు మే ఔర్ ఛార్లెస్ పేరిట ఓ హిందీ చిత్రం వచ్చింది. అలాగే.. 2021లో ది సెర్పెంట్ పేరుతో నెట్‌ఫ్లిక్స్ లో ఓ సిరీస్ కూడా వచ్చింది.