మీరు ఏదైనా రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు.. మీరు చేసిన ఆర్డర్‌కు మాత్రమే కాకుండా సర్వీస్ చార్జ్ పేరుతో ఎక్స్ట్ర బిల్ వేస్తున్నారేమో చూసుకోండి. ఎందుకంటే సర్వీస్ చార్జ్ అనేది ఆప్షనల్. కస్టమర్లకు రెస్టారెంట్ నిర్వాహకుల సర్వీస్ నచ్చితే పే చేయొచ్చు. లేదంటే లేదు. ఈ ఛార్జీల విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. రెస్టారెంట్లు మాత్రం ప్రతి కస్టమర్ నుంచి వసూలు చేస్తున్నాయి. దీనిపై రెస్టారెంట్లను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్‌కు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ హెచ్చరిక చేసింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఈ మేరకు నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ)కు ఓ లేఖ రాశారు.
కొన్ని రెస్టారెంట్లు కస్టమర్ల నుంచి సర్వీస్ చార్జీ పేరిట వసూళ్లు చేపడుతున్నాయని, ఒక్కోసారి సర్వీస్ చార్జీ మరీ దారుణంగా ఎక్కువగా ఉంటున్నాయని ఆ లేఖ పేర్కొంది. ఇలాంటి చార్జీల చట్టబద్ధతపైనా రెస్టారెంట్లు వినియోగదారులను తప్పదారి పట్టిస్తున్నాయని వివరించింది. అంతేకాదు, బిల్ అమౌంట్ నుంచి ఈ సర్వీస్ చార్జీ తొలగించాలని వినియోగదారులు విజ్ఞప్తి చేసినా రెస్టారెంట్లు వేధించిన ఘటనలు ఉన్నట్టు ఆ లేఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఎన్ఆర్ఐఏతో జూన్ 2న సమావేశం కావడానికి షెడ్యూల్ ఫిక్స్ చేసింది. రెస్టారెంట్లు విధిస్తున్న సర్వీస్ చార్జీలపై ఆ సమావేశంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ చర్చించనుంది.