దేశ రాజధాని ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ ఆసుపత్రి వైద్యులు ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కారు. అత్యంత అరుదైన ఘనత సాధించిన రికార్డుల్లో నిలిచారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ నిర్వహించారు. కేవలం 15నిమిషాల్లోనే ఈ సర్జరీ పూర్తి చేసినట్లు ఫోర్టిస్ ఎస్కార్ట్ ఆసుపత్రి వర్గాలు తెలిపారు. ఓఖ్లాకు చెందిన ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రి వైద్యులు 86ఏళ్ల రోగికి తుంటి మార్పిడి సర్జరీ చేశారు. అత్యంత తక్కువ సమయంలోనే ఇలాంటి ఆపరేషర్ చేయడం ప్రపంచవ్యాప్తంగా ఇదే తొలిసారి.
బీహార్ లోని గయా జిల్లాకు చెందిన సుమిత్రా శర్మ జారి కిందపడింది. దీంతో ఆమె తుంటి ఎముక విరిగిపోయింది. మూడు రోజుల తర్వాత శర్మను ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శర్మ రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతుంది. 18 ఏళ్ల క్రితం యాంజియోప్లాస్టీ కూడా చేయించుకుంది. ఈ సర్జరీకి ముందు ఆమెకు యాంజియోగ్రఫీ చేశారు వైద్యులు. అంతేకాదు రక్తాన్ని సన్నగా మార్చే హిమ్ పారిన్ కూడా చేశారు. దీంతో కేసు మరింత క్లిష్టంగా మారింది. ఈ క్రమంలో రోగి ఆరోగ్య పరిస్థితిని ద్రుష్టిలో ఉంచుకుని శస్త్రచికిత్స అత్యవసరమని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
డాక్టర్ కౌశల్ కాంత్ మిశ్రా నేతృత్వంలోని బృందం 15 నిమిషాల 35 సెకన్లలో ఈ సర్జరీ నిర్వహించింది. ఇలాంటి సర్జరీకి తక్కువ సమయం తీసుకోవడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఈ సర్జరీ గతంలో 18నిమిషాల్లో చేస్తే…ఈసారి మూడు నిమిషాల సమయం తక్కువగా పట్టింది. ప్రస్తుతం రోగి ప్రమాదం నుంచి బయటపడినట్లు డాక్టర్ మిశ్రా తెలిపారు. గతంలో తాను ఈ రకమైన సర్జరీ 20 నిమిషాల్లో చేసేవాడినని…చివరి రికార్డు కూడా తన పేరు మీదే ఉందని వెల్లడించారు.