కేంద్రంలోని మోడీ సర్కార్ ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ లద్ధాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్‌ను రెండు ప్రాంతాలుగా విభజన తర్వాత.. అక్కడి ప్రజలు తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏడాది కాలంగా నిరసనలు తెలపుతున్నారు. తాము కేంద్ర పాలిత ప్రాంతంలో ఉండలేమని, లద్ధాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతున్నారు. దీంతో వారికి సర్దిజెప్పేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ వేశారు. కానీ ఈ కమిటీలో భాగమయ్యేందుకు నిరాకరించారు లద్దాఖ్ నేతలు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండడం కన్నా జమ్ముకశ్మీర్‌తో కలవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రాజ్యాంగంలోని ఆరవ అధికరణ ప్రకారం తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని.. కాబట్టి ఈ కమిటీ కార్యకలాపాల్లో భాగం కాకూడదని నిర్ణయించామన్నారు అపెక్స్ బాడీ ఆఫ్ లద్దాఖ్, కార్గిల్ డెమొక్రాటిక్ అలియాన్స్ కమిటీలు. తమ డిమాండ్లను తీర్చే వరకు ప్యానల్‌తో కలిసేది లేదని తేల్చి చెప్పారు. ‘ప్రస్తుత పరిస్థితుల ప్రకారం.. పూర్వ జమ్మూకశ్మీర్‌లో కలవడమే మంచిదనే భావన కలుగుతోంది’అని తెలిపారు అపెక్స్ బాడీ ఆఫ్ లేహ్, లద్దాఖ్ బుద్దిస్ట్ అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఛేరింగ్ డోర్జయ్. రాష్ట్ర హోదా, ప్రత్యేక హోదా కల్పించకుండా కమిటీని ఏర్పాటు చేసి లద్దాఖ్ ప్రజలను కేంద్రం పిచ్చివారిని చేయాలని చూస్తోందని ఆరోపించారు. కమిటీ అజెండాలో ఉద్యోగ భద్రత, లద్దాఖ్ ప్రజల గుర్తింపు, భూభాగాన్ని పరిరక్షిస్తామని చెబుతున్నారని, అయితే ఏ చట్టం, షెడ్యూల్ ప్రకారం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.