ఐదో పెళ్లికి సిద్ధమైన తండ్రి.. చితకబాదిన రెండో భార్య, పిల్లలు
ఆ వ్యక్తికి అప్పటికే నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి. ఏడుగురు పిల్లలున్నారు. అయినప్పటికీ మరో వివాహానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసి అతడి రెండో భార్య, ఏడుగురు పిల్లలు పెళ్లి మండపానికి చేరుకున్నారు. పీటల మీదకు వెళుతున్న తండ్రిని అడ్డుకొని చితకబాదారు. అసలు ఏం జరుగుతుందో అర్థంకాని వధువు.. అక్కడి నుంచి మెల్లెగా జారుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మొహల్లా పటియాకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి.. రోడ్డు కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. మొదటి భార్యకు విడాకులిచ్చి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు ఏడుగురు పిల్లలు. అయితే, ఆరు నెలలుగా ఆమెకు దూరంగా ఉంటున్న ఆయన.. ఇటీవల విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత రహస్యంగా మరో రెండు పెళ్లిళ్లు కూడా చేసుకున్నాడు. అక్కడితో పెళ్లిళ్లపై ఉన్న ఆశ చావలేదు.. రహస్యంగా మరో పెళ్లికి సిద్ధం కావడంతో.. పిల్లలు వచ్చి.. తండ్రికి దేహశుద్ది చేశారు.
మొత్తంగా ఐదో పెళ్లి జరగకుండా రెండో భార్య, ఆమె పిల్లలు బంధువులతో కలిసి కల్యాణ మండపానికి వచ్చి అడ్డుకున్నారు. ఆపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అతడికి నాలుగు పెళ్లిళ్లు జరిగాయని.. ఇది ఐదో పెళ్లి అంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పిల్లలు. తమ తండ్రిని పెళ్లిచేసుకుంటున్న బాలిక తల్లిదండ్రులు.. తమ పేరు మీద ఉన్న ఇల్లు, ఇతర ఆస్తులు కావాలని మాట్లాడుకున్నారని, దాని ఆధారంగానే పెళ్లి జరుగుతుందని పిల్లలు ఆరోపిస్తున్నారు. తమ తండ్రి తమ తల్లిని పట్టించుకోవడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.