ఏడు తలల పాము.. పూజలు సరే, పట్టుకునేది ఎట్లా? - MicTv.in - Telugu News
mictv telugu

ఏడు తలల పాము.. పూజలు సరే, పట్టుకునేది ఎట్లా?

May 8, 2019

మన దేశంలో ఉన్నన్ని వింతలు బహుశా ప్రపంచంలో మరే దేశంలోనూ ఉండవు. భారతీయుల జీవనమే కాదు,  సాంస్కృతిక జీవనం కూడా ప్రకృతితో ముడిపడిందే. తమకింత నీడను, పండ్లను ఇస్తున్న చెట్లను పూజిస్తారు. ఎలకలను తిని పంటలకు రక్షణ కల్పించే పాములను కూడా కొలుస్తారు. వాటికి అతీత శక్తులు ఉంటాయని భావిస్తారు. ఈ నమ్మకాల్లోంచి కొన్ని కనీవినీ ఎరగని రూపాలు పురుడు పోసుకుంటాయి.

ఏడు తలల సర్పం అలాంటిదే. యూట్యూబ్ చూసేవాళ్లకు ఇవి చిరపరిచితమే. రోడ్డు పక్క పేద్దపేద్ద పడగలు విప్పి బుస్సుమంటుంటాయి. మన పల్లెల్లో నాగలకట్టలో ఈ శిల్పం ఉంటుంది. ఏడే కాదు, ఐదు తలల, మూడు తలల సర్పశిల్పాలు కూడా ఉంటాయి. అవి నిజంగానే ఉన్నాయో ఎవరికీ తెలియదు. కానీ నమ్మకం బలమైంది. కర్ణాటకలోని  రామనగర జిల్లా కనకపుర తాలూకా కొడిహళ్లి గ్రామంలో అలాటి ‘ఏడు తలల’ పాము ఒకటి తిరుగుతోందని చెబుతున్నారు. సాక్ష్యాంగా దాని ‘కుబుసాన్ని’ చూపుతున్నారు. ఆ నాగరాజు/రాణి జాడ తెలియకపోయినా కేవలం ఆ కుబుసాన్ని చూసి అది ఉందని భావిస్తున్నారు.

ఎలా ఉంది?

ఇక్కడి కుబుసం ఫొటోల్లో చూపినట్లు. శరీరం ఒకటే ఉందిగాని ‘తలలు ఏడు’ ఉన్నాయి. పైగా శరీరంతో పోలిస్తే చాలా పెద్దగా ఉన్నాయి. మెడ వద్ద నుంచి మొదలయ్యే తలలు కూడా పూర్తిగా విడిపడినట్లు ఉన్నాయి. శరీరం కొన్ని కొన్ని చోట్ల తెగిపోయింది.  ఏడేసి తలలకు తగ్గట్టు శరీరం లేకపోవడం, తలలు చెదిరినట్లు ఉండడంతో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పాముల కుబుసాలను తీసుకొచ్చి అక్కడ ఉంచారని భావిస్తున్నాయి. అయితే అవన్నీ ఒకే పాము తలలని స్థానికులు ఘంటాపథంగా చెబుతున్నారు. కుబుసం విడిచే సమయంలో తలలు చిరిగిపోయి ఉండొచ్చని, అది సప్తశిరో సర్పమేనంటూ పూజలు చేస్తున్నారు. దగ్గర్లో పాముల పుట్ట ఉండడం కూడా వారి విశ్వాసానికి బలం ఇస్తోంది. చుట్టుపక్కల గ్రామాల వాళ్లు కూడా తండోతండాలు వచ్చి పూజలు చేస్తున్నారు.

ఆయనకు 6 నెలల కిందటే కనిపించింది..

ఇంత హడావుడికి మరో బలమైన కారణం కూడా ఉంది. ఏడు తలల పాము వెళ్తుండగా తాను చూశానని  ఆరు నెలల కిందట కోటెకొప్ప గ్రామానికి చెందిన దొడ్డ కెంపేగౌడ ఊరి వాళ్లతో చెప్పాడట. ఆ పామును తాను చూశానని, మీకూ చూపిస్తానని తీసుకెళ్లగా అక్కడ అది కనిపించ లేదట.

Seven headed snake’s skin founded in ramanagara district Karnataka locals worshiping rationalists suspects

హేతువాదులేమంటున్నారు?

చెప్పేదేముంది, కాదని అంటున్నారు. కొన్ని కుబుసాలను తీసుకొచ్చి పెట్టారని, శరీరం, తలభాగాల్లో తేడాలే నిదర్శనమని అంటున్నారు. ఏడు తలలు ఉన్నాయని వాదనకు ఒప్పుకున్నా.. ఆహారం తీసుకోవడం, శ్వాస, నాడీకేంద్రాలు వంటి వాటిలో చాలా ఇబ్బందులు ఉంటాయని వివరిస్తున్నారు. ఒకవేళ జన్యులోపంతో పుట్టినా, అది అంత పెద్దయ్యేంత వరకు బతికి ఉండే చాన్సు లేదని చెబుతున్నారు. మరోపక్క.. దీని సంగతి తమకు తెలియదని జిల్లా అధికారులు చేతులెత్తేస్తున్నారు. కానీ అది నిజమైన ఏడు తలల పామేనని భావించే జనం కూడా తక్కువగా లేరు. కొడిహళ్లి గ్రామ పరిసరాల్లో అది ఎప్పుడోసారి కనిపించకపోతుందా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. చెప్పలేం మరి ఎవరి నమ్మకాలు వాళ్లవి. ఏ పుట్టలో ఏ పామైనా ఉండొచ్చు. ఇటీవల ఆస్ట్రేలియాలో మూడు కళ్ల పాము కనిపించిందిగా మరి…!!