మణిపూర్‌లో కొండ చరియలు పడి ఏడుగురు జవాన్లు మృతి.. 45 మంది గల్లంతు
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండ చరియలు విరిగిపడి ఏడుగురు సైనికులు మరణించారు. 45 మంది దాకా గల్లంతయ్యారు. నోని జిల్లాలో ఈ ఘటన జరుగగా, ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి శిథిలాల కింద చిక్కుకున్న 19 మందిని కాపాడింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మాణంలో ఉన్న జిరిబామ్ నుంచి ఇంఫాల్ వరకు రైల్వే లైన్ రక్షణ కొరకు టుపుల్ రైల్వే స్టేషన్ సమీపంలో 107 టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంపు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఎడతెరపి వర్షాలు పడుతుండగా, బుధవారం అర్ధరాత్రి బేస్ క్యాంపుపై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఏడుగురు జవాన్లు అక్కడికక్కడే మరణించారు. గల్లంతయిన వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా, ఈ దుర్ఘటనపై సీఎం బీరేన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి వెంటనే మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
https://www.sakshi.com/telugu-news/national/manipur-landslides-several-army-persons-dead-and-missing-rescue-operations