కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయల్ ట్యాంకర్లో దిగి ఏడుగురు కార్మికులు మృతి చెందారు. ట్యాంకర్ను శుభ్రం చేసేందుకు ఒకరి తర్వాత ఒకరు దిగగా మొత్తం ఏడుగురు ఊపిరాడక చనిపోయారు.పెద్దాపురం మండలం జి.రాగంపేట నిర్మాణంలోని అంబటి సుబ్బన్న ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఐదుగురు పాడేరు వాసులు కాగా మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరకు చెందినవారుగా గుర్తించారు.
ఇవాళ ఉదయం ఆరు గంటలకే విధులకు వచ్చిన కార్మికులు ఈ ప్రమాదానికి గురయ్యారు. గురువారం ఉదయం 70 నుంచి 100 మంది కార్మికులు తమ విధులు నిర్వహిస్తున్నారు. ట్యాంకర్ శుభ్రం చేసే విధులు చేయాల్సిన కార్మికులు ట్యాంకర్లోకి దిగిన సమయంలో ప్రమాదం జరిగింది. ఒక కార్మికుడు తొలుత ట్యాంకర్ లోకి దిగాడు. ఆ తర్వాత అతని కోసం మరో ఇద్దరు ట్యాంకర్లోకి దిగారని స్థానికులు చెబుతున్నారు. ఇలా ట్యాంకర్లోకి వెళ్లినవారంతా మృతి చెందారు. ఆయిల్ ట్యాంకర్ను కార్మికులు శుభ్రం చేసే సమయంలో పేలుడు సంభవించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్ ట్యాంకర్ను బద్దలు కొట్టి మృతదేహలను వెలికి తీశారు.