పాకిస్తాన్‌లో క్రైస్తవులపై వివక్ష.. పారిశుధ్య పనులు వారికే
పాకిస్తాన్‌లో మైనారిటీలపై వివక్ష రోజురోజుకూ ఎక్కువ అవుతోంది. మరోవైపు దాడులు కూడా జరుగుతున్నాయి. అక్కడున్న క్రైస్తవులకు పారిశుద్య పనులు అప్పగించి నిత్యం వారికి నరకం చూపిస్తోంది పాక్ ప్రభుత్వం. కనీస సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలు లేకుండా వారితో పారిశుద్య పనులు చేయిస్తోంది. దేవుడి మీద భారం వేసి మురికి గుంటలోకి దిగడం.. అదృష్టం బాగుండి విష వాయువులు వెలువడక పోతే బతికి బయటపడుతున్నారు. ఇది నిత్యకృత్యం అయిపోయిందక్కడ. కరోనా సంక్షోభంలో కనీసం వారికి ప్రభుత్వం మాస్కులు గానీ, చేతులకు గ్లోవ్స్ గానీ అందించకుండా దారుణంగా వ్యవహరిస్తోంది. ఇలాంటి కనీస సదుపాయాలు లేక ఇటీవలి కాలంలో అనేక మంది క్రిస్టియన్ కార్మికులు మృత్యువాత పడటం పాకిస్తాన్‌లో ఉన్న కుల, మత వివక్షను చూపెడుతోందని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో వెల్లడించింది. తమలాంటి కార్మికులకు ఆరోగ్య భద్రత లేదని, రోగం బారిన పడి ఆసుపత్రికి వెళ్తే తమను చూసి కొంతమంది డాక్టర్లు లోపలికి కూడా అనుమతించరని.. తమ జీవితాలు ఇలాగే ముగిసిపోతాయంటూ ఎరిక్ అనే కార్మికుడు తమకు ఎదురవుతున్న చేదు అనుభవాల గురించి తెలిపాడు. ఇలాంటి కొందరు కార్మికుల అనుభవాలతో న్యూయార్క్ టైమ్స్ కథనంలో పేర్కొంది.
ముస్లిం మెజారిటీ దేశమైన ఆ దేశంలో మైనార్టీలుగా పరిగణింపబడుతున్న హిందూ, క్రిస్టియన్ వర్గాలు మాత్రమే మురికి కాలువలు శుభ్రం చేసే పనిచేయాల్సి ఉంటుంది. గతేడాది జూలైలో పాకిస్తాన్ సైన్యం ఓ పత్రికలో.. ‘కేవలం క్రైస్తవులు మాత్రమే స్వీపర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు వారు మాత్రమే అర్హులు’ అంటూ ఓ వివాదాస్పద ప్రకటన చేసింది. దీంతో అక్కడ వివక్ష ఏ స్థాయిలో ఉందో అంచనా వేయొచ్చు. అయితే ఇలాంటి ప్రకటనలపై మానవ సంఘాలు భగ్గుమనడంతో వెనక్కి తగ్గిన అధికారులు మతం అనే ఆప్షన్‌ను తీసివేశారు. కానీ, నియామకాల్లో మాత్రం అదే వివక్షను కొనసాగిస్తున్నారు. పాకిస్తాన్‌లోని చాలా వరకు మున్సిపాలిటీల్లో క్రిస్టియన్లు స్వీపర్లు, సీవర్ క్లీనర్లుగా ఉంటారు. ఎలాంటి రక్షణ లేకుండా ఒట్టి చేతులతోనే వారు మురికి కాలువలు, పైపులు, అందులోకి వచ్చే ఆసుపత్రి, పరిశ్రమల వ్యర్థాలను శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇందుకు వారికి చెల్లించే జీతాలు కూడా చాలా తక్కువే. మూడు కాల్వలు శుభ్రం చేసినందుకు కేవలం 6 డాలర్లు మాత్రమే చెల్లిస్తారు. వారు చదువుకోలేదు.. అందుకే వాళ్లను ఇలా హింసిస్తారు. ఈ విషయం గురించి మాజీ ఎంపీ, స్వీపర్ ఆర్ సూపర్‌హీరోస్ అడ్వకసీ గ్రూపును నడుపుతున్న మేరీ జేమ్స్ గిల్ మాట్లాడుతూ.. ‘సీవేజ్ క్లీనింగ్ కోసం యంత్రాలు అందుబాటులోకి తీసుకు రావాలని నేను ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నాను. అయితే పారిశుధ్య కార్మికుల్లో చాలా మంది నిరక్షరాస్యులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు వారిని సులభంగా ఒప్పించి మురికి కూపంలోకి దింపుతున్నారు. సరైన సదుపాయాలు కూడా అందుబాటులో ఉండకపోవడం వల్ల వారంతా చర్మ, శ్వాసకోశ సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే కొంతమంది తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం’ అని తెలిపారు. కాగా, దాదాపు 20 కోట్ల జనాభా ఉన్న పాకిస్తాన్‌లో సుమారు 80 శాతం పారిశుద్ధ్య కార్మిక పోస్టుల్లో మైనార్టీలనే నియమిస్తున్నారని.. వారి పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.