అడవిలో లింగనిర్ధారణ.. డాక్టర్ అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

అడవిలో లింగనిర్ధారణ.. డాక్టర్ అరెస్ట్

March 16, 2018

ఆడపిల్ల పుట్టుకే శాపమనే భావించే దేశం మనది. మూఢనమ్మకాలు, పేదరికం, కట్నకానుకల భారం..  మరెన్నో కారణాలు ఏటా లక్షణాది భ్రూణహత్యతకు దారితీస్తున్నారు. ఈ మారణకాండలో డాక్టర్ల పాత్రకూడా తక్కువేమీ కాదు. లింగనిర్ధరాణ పరీక్షలు చట్టవిరుద్ధం కావడంతో కొందరు వైద్యులు అత్యంత రహస్యంగా వాటిని నిర్వహించి పబ్బం గడుపుకుంటున్నారు. ఆడపిల్లల ఉసురు పోసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో ఆరితేరిన ఓ డాక్టర్ ఊరిలో పరీక్షలు నిర్వహిస్తే దొరికిపోతామని ఏకంగా దట్టమైన అడవిలో ఆ పాపాలను ఒడిగట్టాడు. దీనిపై ఉప్పందడంతో అతని అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడింది.ఢిల్లీకి చెందిన సుభాష్ జైన్ అనే వైద్యుడు వినోద్ కుమార్, మనోజ్ కుమార్ అనే ఇద్దరితో కలసి ఈ రాకెట్ నడుపుతున్నాడు. ఢిల్లీ, హరియాణా సరిహద్దులోని దట్టమైన అడవిలో తన వాహనంలో లింగనిర్ధారణ యంత్రాలు, గట్రా అమర్చుకున్నాడు. ఆడపిల్లలను పిండదశలోనే వదిలించుకోవాలని గర్భిణులను కలసి వారిని అడవిలోకి తీసుకెళ్లి, తన కారులో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడు. ఈ విషయం వైద్యశాఖ అధికారులకు తెలిసింది.

సుభాష్ ఆటకట్టించడానికి వారు ఒక గర్భిణి సాయం తీసుకున్నారు. ఆమె నిందితులతో 30వేలకు ఒప్పందం కుదుర్చుకుంది. వారు ఆమెను బుధవారం మారుతికారులో సెర్సా గ్రామం సమీప అడవుల్లోకి తీసుకెళ్లారు. ఆ వాహనాన్ని పోలీసులు, వైద్యశాఖ అధికారులు రహస్యంగా అనుసరించారు. మారుతి కారు అడవిలోకి చేరుకుంది. తర్వాత సుభాష్ ఆమెను తన కారులోకి ఎక్కమన్నాడు. ఆమె అలాగే చేసింది. తర్వాత సుభాష్.. లింగనిర్ధారణ పరీక్ష ప్రారంభించాడు. ఆల్ట్రాసౌండ్ మెషిన్, బ్యాంటరీ, జనరేటర్ వంటి పరికరాలను సిద్ధ చేసుకున్నాడు.. పరీక్ష ప్రారంభిస్తుండగా పోలీసులు, అధికారులు దాడి చేసి ముగ్గురు నిందితులపు పట్టుకున్నారు. వారిపై పలు కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచారు.