కరోనా రోగికి వైద్యం చేసిన ఆర్ఎంపీ డాక్టర్.. క్లినిక్ సీజ్ - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా రోగికి వైద్యం చేసిన ఆర్ఎంపీ డాక్టర్.. క్లినిక్ సీజ్

April 4, 2020

Shadnagar RMP Doctor Who Healed The Corona Patient .. Clinic Siege
కరోనా రోగికి వైద్యం చేసిన ఓ ఆర్ఎంపీ వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దవాఖానాను సీజ్ చేశారు. ఈ ఘటన షాద్ నగర్‌లో చోటు చేసుకుంది. షాద్‌నగర్‌ మండలంలోని చేగూరుకు చెందిన భారతమ్మ అనే మహిళ ఇటీవల కరోనాతో మరణించింది. దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడుతున్న ఆమె తొలుత ఓ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చికిత్స చేయించుకుంది. తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. దగ్గు, జలుబు, జ్వరాలతో బాధపడేవారు నేరుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కనబెట్టి భారతమ్మకు చికిత్స చేసినందుకు సదరు ఆర్ఎంపీ డాక్టర్‌కు చెందిన క్లినిక్‌ను సీజ్ చేశారు. సదరు ఆర్ఎంపీ డాక్టర్‌ను కూడా అధికారులు కరోనా పరీక్షలకు పంపారు. ఆర్‌ఎంపీలు ఎవరైనా క్లినిక్‌లు తెరిస్తే ఎపిడమిక్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 

కాగా, ఆమె చనిపోయిన తర్వాత శాంపిళ్లు సేకరించి ల్యాబ్‌కు పంపగా కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాక ఈ విషయం వెలుగులోకి రావడంతో గ్రామస్థులు, ఆమె బంధువులు భయాందోళనకు గురయ్యారు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన 22 మందిని గుర్తించిన అధికారులు.. వారిని రాజేంద్ర క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. మృతురాలి భర్తను కోరంటి ఆసుపత్రికి తరలించారు.