shah rukh khan pathan movie review bollywood bounce back
mictv telugu

పఠాన్ రివ్యూ..!

January 25, 2023

shah rukh khan pathan movie review bollywood bounce back

షారుఖ్ ఖాన్ మోస్ట్ ఏవైటింగ్ మూవీ పఠాన్ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దీపికా పదుకొనే అందాలు, షారుఖ్ పై ఉండే రాజకీయ కక్షతో వచ్చిన హైప్ కారణంగా పఠాన్‌కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా దేశంలోని పలు పాత నగరాలు, మెట్రో సిటీస్‌లో షారుఖ్ మ్యానియా కనిపించింది. పాన్ ఇండియా సినిమాల దాడులతో.. సరైన ఒక్క హిట్ లేక పాతాళానికి పడిపోయిన బాలీవుడ్‌కి పఠాన్ ఆక్సిజన్ ఇవ్వనుందని, హిందీ సినిమాకి తిరిగి పూర్వ వైభవం ఇచ్చే సినిమాగా షారుఖ్ పఠాన్‌ని చూస్తున్నారు. దాంతో ఈ మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా చాలు.. పఠాన్‌కి 500కోట్లు ఖాయమనే చర్చ నడుస్తోంది. ఇక షారుఖ్ సుడి తిరిగి హిట్ టాక్ వస్తే బాలీవుడ్ రికార్డులు బద్దలవ్వటం గ్యారెంటీ అంటున్నారు. ఈ నేపథ్యంలో పఠాన్ మొదటి షో ప్రకారం, క్రిటిక్స్ ఇచ్చిన రివ్యూస్ ప్రకారం చూస్తే.. పఠాన్ చిత్రం అంచనాలని అందుకోవడంలో విఫలం కాలేదనే శుభవార్త అయితే బీ టౌన్ నుండి వినపడుతోంది.

ప్రముఖ బాలీవుడ్ రివ్యూవర్స్ ఇచ్చిన కథనాల ప్రకారం.. ‘పఠాన్ చిత్రం దేశం కోసం పనిచేసే ఒక ఉద్వేగభరితమైన ఏజెంట్ కథ. 2019లో, భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత, కోపం ఆపుకోలేక ఒక పాకిస్తాన్ జనరల్ భారత్ పై ప్రతీకారంతో రగిలిపోతుంటాడు. దాంతో భారతదేశం పట్ల విపరీతమైన శత్రుత్వం కలిగి ఉన్న భయంకరమైన ఉగ్రవాది జిమ్ (జాన్ అబ్రహం)తో భారత్‌లో అటాక్ చేయాలనీ ఒప్పందంపై సంతకం చేస్తాడు జనరల్ ఖాన్. ఈ విషయం తెలిసిన RAW ఏజెంట్ నందిని (డింపుల్ కపాడియా) పాకిస్తాన్ నుండి భారత్‌ని రక్షించేందుకు.. భారతదేశానికి చెందిన అత్యుత్తమ ఏజెంట్‌లలో ఒకరైన పఠాన్ (షారూఖ్ ఖాన్) ఏజెంట్‌ని సంప్రదిస్తుంది. దాంతో అసలు విషయం తెలుసుకుని పాకిస్తాన్ ఉగ్రవాది జాన్ అబ్రహం బారి నుండి ఇండియాని రక్షించుకోవడానికి పఠాన్ చేసే సాహసాలు ఏంటీ.. దేశం కోసం ప్రాణాలకు తెగించి చేసిన పోరాటలేంటన్నదే పఠాన్ కథాంశం అట.

ఒక అనాథగా.. దేశాన్నే తన తల్లిగా భావిస్తూ జీవించే ఏజెంట్ పాత్రలో షారుఖ్ ఖాన్ మైమరిపించే నటన కనపరిచాడని అంటున్నారు. పఠాన్ లాంటి కథలు మనకు ఎన్నోసార్లు చూసినట్టు అనిపించినా.. స్క్రీన్ ప్లేతో దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ మ్యాజిక్ చేసేశాడు. ఆద్యంతం ఎంగేజింగ్ గా కథనాన్ని నడిపించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. నాలుగు సంవత్సరాల విరామం తర్వాత షారుఖ్ ఖాన్‌ని పవర్ ఫుల్, సెంటిమెంట్ పాత్రలో చూపెట్టాడు. అన్నింటికీ మించి భారత దేశ ప్రేమికుడిగా షారుఖ్ ఒదిగిపోయి నటించిన తీరు థియేటర్స్‌లో ఉద్వేగానికి గురిచేస్తుందని టాక్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ కాస్త పడుతూ లేస్తూ గడిచినా.. సాధారణ ఇంటర్వెల్ బ్యాంగ్ అనిపించినా.. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ జర్నీ ప్రేక్షకుడిని కట్టి పడేస్తుందని అంటున్నారు.‌

సల్మాన్ ఖాన్ బజరంగి భాయిజాన్ వంటి దేశభక్తి అనుభూతిని.. పఠాన్ సెకండ్ హాఫ్ ఇస్తుందని అంటున్నారు. దేశభక్తి సినిమాలు బాలీవుడ్ లో తగ్గాయి అనుకున్న టైమ్‌లో పఠాన్ రావటం.. ప్రధాన అనుకూలత. అలాగే విలన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, ఆఫ్ఘానిస్తాన్ విలేజ్ డ్రామా అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాకున్నా షారుఖ్, దీపికాలు చాలావరకు డ్యామేజ్‌ని కవర్ చేసేశారు. అలాగే యశ్ రాజ్ ఫిల్మ్స్‌ బ్యానర్‌లో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాల రిఫరెన్సులు ఇందులో కనిపిస్తాయని అంటున్నారు. ఏదేమైనా.. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ట్రైన్ ఫైట్ సీక్వెన్సు, క్లైమాక్స్ ఎమోషన్స్, షారుక్ పెర్ఫార్మెన్స్, దీపికా అందాలు సినిమాకి సూపర్ హిట్ టాక్ తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.