ఇమ్రాన్‌పై ప్రతీకారం తీర్చుకోం. కానీ.. : షహబాజ్ షరీఫ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇమ్రాన్‌పై ప్రతీకారం తీర్చుకోం. కానీ.. : షహబాజ్ షరీఫ్

April 11, 2022

hfgbh

పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాని పదవి నుంచి దిగిపోగా, తదుపరి ప్రధానిగా ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు షహబాజ్ షరీఫ్ తదుపరి ప్రధాని అయ్యే అవకాశాలున్నాయి. ఇంతకు ముందు అవిశ్వాస తీర్మాన కార్యక్రమం అయిన తర్వాత ఆయన ట్విట్టర్‌లో పాక్ ప్రజలకు సందేశం ఇచ్చారు. ‘మేం ఎవ్వరిపైనా ప్రతీకారం తీర్చుకోం. ఎవ్వరినీ జైల్లో పెట్టం. కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మన దేశం ఇప్పుడు పెద్ద సంక్షోభం నుంచి బయటపడింది. కొత్త ఉదయానికి మనందరం స్వాగతం పలుకుదాం’అని వ్యాఖ్యానించారు. కాగా, కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా పాక్ పార్లమెంటు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం కానుంది. ఇదిలా ఉండగా, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్.. దేశం విడిచి పారిపోయే ప్రమాదముందని, ఆయన పేరును ‘ది ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్’లో పెట్టాలంటూ పిటిషనర్ కోరారు. ఈ లిస్టులో పేరు ఎక్కిన వారు దేశం విడిచి పెట్టడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ ఎదుర్కోవాల్సిందే.