షహీన్ బాగ్ నిరసనలు.. సుప్రీం కీలక ఆదేశాలు - MicTv.in - Telugu News
mictv telugu

షహీన్ బాగ్ నిరసనలు.. సుప్రీం కీలక ఆదేశాలు

February 17, 2020

Shaheen Bagh.

సీఏఏకు వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో నెలరోజులకు పైగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సీఏఏపై ఇంత సుదీర్ఘంగా నిరసనలు కొనసాగుతుండటంతో షహీన్‌బాగ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. అయితే షహీన్‌బాగ్ రోడ్డు దిగ్బంధం, కాలింది కుంజ్, నొయిడాను అనుసంధానించే ప్రధాన రోడ్డు షహీన్ బాగ్ స్ట్రెచ్‌ వెంబడి దిగ్బంధాలను తొలగించేందుకు అధికారులను ఆదేశించాలంటూ పలు పిటిషన్లు సోమవారంనాడు సుప్రీం బెంచ్ ముందు విచారణకు వచ్చాయి. ఈ సందర్బంగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘కారణాలు సహేతుకమే కావచ్చు. ఇలా ప్రతి ఒక్కరూ రోడ్లు దిగ్బంధం చేస్తూ పోతే అది ఎక్కడికి దారితీస్తుంది? ఎక్కడ ఆగుతుంది?. నిరసనలు తెలిపే హక్కు అందిరికీ ఉంది. కానీ రోడ్డు దిగ్బంధం చేయడం సరికాదు’ అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. నిరసనకారులు తమ నిరసనలు వ్యక్తం చేసేందుకు వీలుగా ప్రత్యామ్నాయ స్థలాన్ని సూచించాలని కూడా ఢిల్లీ పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.

ఈ విషయమై న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, కేఎం జోసెఫ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుంది. అయితే దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. స్థానికులు నిరసనలు చేయవద్దని చెప్పడం లేదు.. ఎక్కడ ప్రదర్శనలు నిర్వహించాలన్నదే అసలు ప్రశ్న’ అని పేర్కొంది. కాగా, షహీన్‌బాగ్ నిరసనకారులను కలుసి, వారితో మాట్లాడేందుకు, పరిష్కారం కనుగొనేందుకు సీనియర్ లాయర్ సంజయ్ హెగ్డే, న్యాయవాది సాధనా రామచంద్రన్‌లను మధ్యవర్తిత్వం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.