ఒక మహిళపై ఉన్న ఆగ్రహంతో ఏకంగా 80 మున్నూరు కాపు కుటుంబాలకు గ్రామ బహిష్కరణ శిక్ష విధించారు గ్రామ పెద్దలు. ఈ సాంఘిక బహిష్కరణ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. నందిపేట మండలం షాపూర్ గ్రామంలోని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం వెలుగు చూసింది. వివరాల్లోకెళితే.. గ్రామానికి చెందిన ఎనుగంటి సుజాత గతంలో గ్రామంలో ఓ స్థలాన్ని కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకుంది. అయితే ఆ స్థలం గ్రామ పంచాయితీకి చెందిందని గ్రామ కమిటీ ఆరోపిస్తూ సుజాత కుటుంబాన్ని బహిష్కరిస్తూ తీర్మానం చేసింది. ఆ కుటుంబంతో మిగతా గ్రామస్తులు ఎవ్వరూ మాట్లాడకూడదు.. సహకరించకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయితే అదే గ్రామంలోని మున్నూరు కాపు వర్గానికి చెందిన ముప్పటి గంగారం పొరపాటున ఉపయోగంలో లేని తన ఇంటి కరెంటు మీటరు సుజాతకు ఇవ్వగా.. దీనిపై వివాదం రేగింది.
గ్రామ తీర్మానాన్ని ఉల్లంఘించినందుకు గంగారాంకి లక్షా పదివేల రూపాయల జరిమానా విధించి వసూలు చేసింది. సుజాతకు ఇచ్చిన విద్యుత్ మీటరును తిరిగి ఇప్పిస్తామంటూ నోట్ రాసిచ్చింది గ్రామ కమిటీ. అయితే ఒప్పందం ప్రకారం కరెంటు మీటరు ఇప్పించకపోవడంతో విసుగుచెందిన గంగారాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహం చెందిన కమిటీ.. గంగారాం కులానికి చెందిన 80 కుటుంబాలను బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. ఆ కుటుంబాలతో ఎవరు మాట్లాడినా పదివేల జరిమానా, పంట భూములను కౌలుకు ఇస్తే లక్ష జరిమానా చెల్లించాలని స్పష్టం చేసింది. దాంతో పాటు ఇతర కులాల వారు సహకరించవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో 80 కుటుంబాలు పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేయగా వారు వెంటనే రంగంలోకి దిగి గ్రామకమిటీకి హితబోధ చేశారు. ఇది రిపీటయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు బాధితులకు ధైర్యం చెప్పి భరోసా కల్పించారు.