Shahrukh Khan Blockbuster Movie Pathan Breaks Baahubali -2 Collection Records
mictv telugu

Pathan Collections : బాహుబలి-2 రికార్డులను బద్ధలు కొట్టిన పఠాన్

March 4, 2023

 

shahrukh-khan-blockbuster-movie-pathan-breaks-baahubali-2-collection-records

బాద్ షాని టచ్ చేస్తే సౌండ్ సాలిడ్‎గా ఉంటుంది. పిచ్ నీదైన మ్యాచ్ నాదే. బాద్ షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది.అనే డైలాగ్‌తో అదరగొట్టిన జూ ఎన్టీఆర్ మాటలను బాలీవుడ్ బాద్ షా షారూఖ్ నిజం చేసి చూపెట్టాడు. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన షారూఖ్ “పఠాన్” చిత్రంతో తన పవర్‌ని మరోసారి ప్రపంచానికి పరిచయం చేశాడు. సినిమా వచ్చి ఇప్పటికీ సుమారు 40 రోజులు అవుతున్న కలెక్షన్స్ తుఫాన్ ఆగడం లేదు. దేశ, విదేశాల్లో అదిరిపోయే కలెక్షన్లతో దుమ్మురేపింది. షారూఖ్ క్రేజ్ ముందు పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఇప్పటికే ఎన్నో రికార్డులను తిరగరాసిన పఠాన్ చిత్రం తాజాగా మరో కొత్త రికార్డును సృష్టించింది.

నాలుగేళ్ల గ్యాప్ తర్వాత పఠాన్‌గా వచ్చిన షారూఖ్..బాలీవుడ్‎కు ఊపుతెచ్చాడు. గత కొంతకాలంగా గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్న హిందీ చిత్రపరిశ్రమకు తన పఠాన్ చిత్రంతో ప్రాణం పోశాడు. విడుదలకు ముందు ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా..తెరపై ఒక్కసారి షారూఖ్ కనిపించాక నోళ్లు మూసుకుపోయాయి. మొదటి రోజు నుంచే ఎదురులేకుండా దూసుకుపోతుంది.

షారూఖ్ పవర్ ఎంటో భాక్సాఫీస్ వద్ద పఠాన్ చిత్రంలో మరోసారి రుజువైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ దేశవ్యాప్తంగా రూ.529.7 కోట్ల కలెక్షన్లు సాధించగా.. ప్రపంచ వ్యాప్తంగా రూ.1027 కోట్లతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని సృష్టించింది. దీంతో బాహుబలి-2 రికార్డును అధిగమించింది. హిందీ భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా టాప్-1 లో పఠాన్ నిలిచింది. బాహుబలి ది కన్‌క్లూజన్ హిందీ వెర్షన్ రూ.511 కోట్ల కొల్లగొట్టగా.. పఠాన్ రూ.529 కోట్లతో ఆ రికార్డును బ్రేక్ చేసింది.

షారూఖ్ హీరోగా, దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేసిన పఠాన్ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సినిమాలో జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించారు. కండల వీరుడు సల్మాన్ సైతం పఠాన్‌లో గెస్ట్ రోల్‌గా కనిపించాడు.