Shahrukh poured petrol on Ankita and set her on fire in Jharkhand
mictv telugu

ప్రేమించట్లేదని దారుణం.. నిద్రిస్తున్న యువతిపై పెట్రోల్ పోసి తగులబెట్టేశాడు

August 29, 2022

ప్రేమ పేరుతో దేశంలో రోజురోజుకీ దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రేమించట్లేదని ఆవేశంలో యువతులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా జార్ఖండ్‌లో అలాంటి సంఘటన జరిగింది. ప్రేమకు ఒప్పుకోవట్లేదని ఓ యువకుడు నిద్రిస్తున్న యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దాంతో వారం రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన యువతి.. చివరకి ప్రాణాలు విడిచింది. పూర్తి కథనంలోకి వెళితే.. దుమ్కా జిల్లాలో షారూక్ హుస్సేన్ (19) అనే యువకుడు అంకిత (19) అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. అయితే అంకిత ప్రేమ ప్రపోజల్‌ని తిరస్కరించడంతో ఆమెపై కక్ష పెంచుకున్న షారూక్.. ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించాడు.

ఈ క్రమంలో ఈ నెల 23న అంకిత నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడిన షారూక్.. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఆమెపై పోసి నిప్పంటించి పరారయ్యాడు. మంటలతో 90 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన అంకిత ఆదివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మరణించింది. అంతకు ముందు ఆమె పోలీసులకు ఇచ్చిన మరణ వాంగ్మూలంలో.. షారూక్ తనను ఎలా వేధించిందీ చెప్పింది. నిద్రిస్తున్న తనకు కాలిన వాసన రావడంతో మెలకువ వచ్చి చూస్తే షారూక్ పారిపోతూ కనిపించాడని, తేరుకునేలోపే మంటలు అంటుకున్నాయని వివరించింది. దీంతో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు షారూక్‌తో పాటు అతడికి పెట్రోల్ అందించిన చోటు ఖాన్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఇంతటితో ఆగలేదు. రాజకీయ రంగు పులుముకొని ప్రకంపనలు సృష్టించింది. విషయం తెలిసిన బీజేపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు రోడ్డెక్కి ధర్నాలు చేశారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లవ్ జిహాద్ అరికట్టాలని డిమాండ్ చేశారు.