లోకంలో ఎక్కడైనా గర్ల్‌ఫ్రెండ్ లేదని, లేదా దొరకట్లేదని బాధపడే అబ్బాయిలు ఉంటారు. కానీ చైనాలోని షాంఘైకి చెందిన ఓ యువతి మాత్రం దీనికి భిన్నంగా తనకు బాయ్‌ఫ్రెండ్ లేడని కన్నీరు పెట్టుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాయ్‌ఫ్రెండ్ కోసం అనేక డేటింగ్ యాపులలో వెతికినా ఫలితం లేకుండా పోయిందని వాపోయింది. 28 ఏళ్ల సదరు యువతి తన వదినతో ఉద్యోగంలో ఉండే ఒత్తిడి గురించి చాట్ చేస్తున్న సమయంలో మాటల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంతవరకు ఒక్క మగాడి చేయి కూడా పట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
బాయ్‌ఫ్రెండ్ లేకపోయినా నిరాశకు లోనవనని, రాబోయే కాలంలో కచ్చితంగా సెట్ చేసుకుంటానని ధీమాగా ఉంది. కాగా, మనలాగే చైనాలో కూడా అబ్బాయిల సంఖ్య ఎక్కువ. అమ్మాయిలు తక్కువ. అయినా అక్కడ అబ్బాయిలు దొరక్కపోవడానికి కారణం అమ్మాయిలకు బయటి ప్రపంచంతో సంబంధాలు లేకపోవడమేనని చెప్తున్నారు. అక్కడ ఇదొక పెద్ద సమస్యగా మారింది. ఎక్కువగా కెరీర్ అంటూ ఆఫీస్ పనిలో నిమగ్నమవడం, బయట ఓ ప్రపంచం ఉందని గుర్తించకపోవడంతో ఈ సమస్య ఎదురవుతుందని అభిప్రాయపడుతున్నారు. దీనికి పరిష్కారంగా కొన్ని సంస్థలు తమ దగ్గర పనిచేసే 30 ఏళ్లు దాటిన బ్యాచిలర్ ఉద్యోగినులకు చైనీస్ న్యూఇయర్ సందర్భంగా ప్రత్యేకంగా డేటింగ్ కోసమే 8 రోజుల అదనపు సెలవులు ఇచ్చాయి. మరి ఈ చిట్కా ఎంతవరకు పని చేస్తుందో చూడాలి.