ఫిదా విజయ రహస్యంలో ఆయన ఎంచుకున్న వ్యక్తులు ! - MicTv.in - Telugu News
mictv telugu

ఫిదా విజయ రహస్యంలో ఆయన ఎంచుకున్న వ్యక్తులు !

July 26, 2017

‘ ఫిదా ’ సినిమాలో హీరోకు వదినగా, హీరోయిన్ కు అక్కగా నటించిన ‘ శరణ్యా ప్రదీప్ ’ తెలుగవారి హృదయాలను దోచుకుంది. తన చక్కని సహజమైన నటనతో రేణుక పాత్రకు పూర్తి న్యాయం చేసిందనే చెప్పాలి. హీరో లైక్ చేసే వదినగా, తండ్రికి బాధ్యతగల పెద్ద కూతురిగా, చెల్లెలికి ఇష్టమైన అక్కగా, భర్తకు అణకువ గల భార్యగా.., ఆ పాత్రకు హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ అయింది. ఒక్కసారిగా తెలుగు ఆడియన్స్ కు మంచి వదిన దొరికిందన్నంతగా ఆ పాత్రలో ఒదిగిపోయింది.

అమాయకత్వం ఉట్టిపడే ఈ ఫిదా వదిన శరణ్యా ప్రదీప్ నిజామాబాద్ జిల్లా సుభాష్ నగర్ కు చెందినది. తొలుత లోకల్ టీవీ యాంకర్ గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత వి6 ‘ తీన్మార్ వార్తలు ’ కార్యక్రమంలో లచ్చమ్మగా తెలంగాణ ప్రేక్షకులను అలరించింది. అటు తర్వాత టీన్యూస్ లో ఇప్పుడు ‘ ధూంధాం వార్తలు ’ ప్రోగ్రాంకు యాంకర్ గా చేస్తోంది. అటు యాంకర్ గా చేస్తూనే, శేఖర్ కమ్ముల సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్లి ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడిలా తెలుగు ప్రేక్షకుల వదినమ్మగా అందరి మెప్పును పొందుతోంది. ఇప్పడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్న శరణ్యా ప్రదీప్ కు అభినందనలు చెబుదామా !

మధుప్రియ మస్త్ సాంగ్ !
ఇప్పుుడు ఎవరి నోటా విన్నా ‘ మెల్లా మెల్లగా వచ్చిండే ’ అనే పాటే వినబడుతోంది. ఈ పాట పాడిన మధుప్రియకు నేపథ్య గాయనిగా మంచి పేరొచ్చింది. ఈ పాట మీద సాయి పల్లవి చేసిన పర్ ఫార్మెన్స్ ప్రేక్షకులను ఊపేస్తోంది. మధుప్రియ మస్తు సాంగు పాడిందని ప్రశంసలు వస్తున్నాయి. ‘ ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని దిగులు చెందకమ్మా ’ అనే పాటతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన మధుప్రియ ఫిదాలో ఆలపించిన ఈ పాట చాలా మంది నోళ్ళల్లో నానుతోందిప్పుడు.

మాభూమి సాయిచంద్..

ఈ సినిమాలో తండ్రి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఇద్దరు ముద్దుల కూతుళ్ళకు తండ్రిగా సాయిచంద్ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. 1980 లో వచ్చిన ‘ మాభూమి ’ 1992 లో వచ్చిన ‘ అంకురం ’ సినిమాలు చేసి ఆ తర్వాత 25 ఏళ్ళ విరామం తీస్కొని చేసిన సినిమా ఫిదా. ఇంత గ్యాప్ రావడానికి కారణం దూరదర్శన్ ఛానల్ లో రకరకాల ప్రోగ్రాములు చేసుకుపోవడం వల్లే. వాళ్ళ నాన్న త్రిపురనేని గోపీచంద్ నవల ‘ పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా ’ నవలను అదే పేరుతో టెలీఫిల్మ్ ను తీసారట. అలా చాలా టెలీఫిల్మ్స్, డాక్యుమెంటరీలు కూడా చేసారు. ఇంత గ్యాప్ తర్వాత వచ్చిన ఫిదాలోని పాత్ర తనకి గొప్ప బూస్టునిచ్చిందని చెప్తున్నారు.

తెలుగు హమ్ ఆప్కే హై కౌన్ !

ఆ మధ్య హిందీలో వచ్చిన సల్మాన్ ఖాన్ ‘ హమ్ ఆప్కే హై కౌన్ ’ సినిమానే ఫిదా సినిమాకు స్ఫూర్తి అనొచ్చు. అందులో వదిన చెల్లెలు మీదే హీరో మనసు పారేస్కుంటాడు. కాకపోతే అందులో వదిన చనిపోయి స్యాడ్ ఎండింగ్ అయితే ఇందులో అలాంటిదేం పెట్టకుండా హ్యాప్పీ ఎండింగును పెట్టాడు శేఖర్ కమ్ముల. హమ్ ఆప్కే హై కౌన్ సినిమాలో వదిన పాత్ర చేసిన నటి ఒర్జినల్ నేమ్ రేణుక పేరునే ఫిదాలో అక్క పేరుగా పెట్టాడు శేఖర్ కమ్ముల. రేణుక పాత్రకు ఇన్స్ పిరేషన్ హమ్ ఆప్కే హై కౌన్ లోని వదిన పాత్రేనని అర్థమౌతుంది. కథ కూడా టూకీగా అదే. కాస్త అటూ ఇటూ చేసి, దానికి తెలంగాణ, అమెరికా నేపథ్యం, తెలంగాణ కల్చర్, భాషను పెట్టి మార్చారు అంతే.