ఎన్టీఆర్ పేరు మార్పు.. YS జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షర్మిల
ఏపీలో రాజకీయ విమర్శలు, వివాదాలకు కారణమైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశంపై షర్మిల చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణలో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న వైఎస్ ఒక ప్రభుత్వం పెట్టిన పేరును మరో ప్రభుత్వం తొలగిస్తే అవమానపరిచినట్లే అవుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని తప్పు పట్టారు వైఎస్ జగన్ సోదరి షర్మిల. ఎన్టీఆర్ అంటే కోట్లాది మంది ప్రజలకు అభిమానం ఉందని, అలాంటి వ్యక్తి ఖ్యాతి తీసుకొని వైఎస్సార్‌కి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఖండించారు.
ఒక ప్రభుత్వం పెట్టిన పేరును మరో ప్రభుత్వం తొలగిస్తే అవమానించినట్లే అవుతుందన్నారు. పేరు మార్చడం వల్ల యూనివర్సిటీ ప్రాధాన్యత పోతుందన్నారు. ఏవో కారణాల చేత యూనివర్సిటీకి ఒక పేరు పెట్టారని, ఆ పేరును అలాగే కొనసాగిస్తే వారికి గౌరవం ఇచ్చినట్లు ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఒక్కోసారి ఒక్కోపేరు పెట్టుకుంటూ పోతే ఎవరు ఏది రెఫర్ చేస్తున్నారో తెలియక ప్రజల్లో ఆయోమయం నెలకొంటుందని చెప్పారు. ఇప్పుడు వైఎస్సార్ పేరు పెడతారు.. రేపు వచ్చే ప్రభుత్వం.. మళ్లీ పేరు మారిస్తే వైఎస్సార్‌ను అవమానించినట్లే కదా అని వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు మళ్లీ ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వస్తుందన్న నమ్మకం లేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.