షర్మిలమ్మ పెళ్లికూతురాయెనే.. - MicTv.in - Telugu News
mictv telugu

షర్మిలమ్మ పెళ్లికూతురాయెనే..

August 17, 2017

మణిపూర్ ఉద్యమ ఆణిముత్యం, మానవ హక్కుల కోసం 16 ఏళ్ల పాటు నిరాహార దీక్ష చేసిన ఉక్కు మహిళ ఇరోం షర్మిలి ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. సుదీర్ఘకాల సహచరుడైన బ్రిటన్ జాతీయుడు డెస్మండ్ కోటిన్హోను గురువారం తమిళనాడులోని కొడైక్కెనాల్లో మనువాడారు. ఇద్దరూ తొలుత హిందూసంప్రదాయం ప్రకారం పెళ్లిచేసుకుని, తర్వాత రిజస్ట్రార్ ఆఫీసుకెళ్లి లాంఛనాలు ముగించారు.

టీనేజ్ నుంచే ఒక మంచి లక్ష్యం కోసం పోరాడుతూ పెళ్లిన వాయిదా వేసిన షర్మిల చివరకు పెళ్లి రోజున కూడా పోరాటం చేయాల్సి వచ్చింది. కొడైక్కెనాల్ లోని గిరిజనుల హక్కుల కోసం ఆమె పోరాడతారని అభిమానులు చెప్పడం పెద్ద గొడవకు దారి తీసింది. ప్రశాంతంగా ఉండే ఆ కొండల్లో ఈ ఉద్యమకారిణి పెళ్లి చేసుకుంటే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని కొందరు స్థానికులు అభ్యంతరం చెప్పారు. అయితే అధికారులు అదేమీ పట్టించుకోకుండా పెళ్లికి అనుమతించారు.

మణిపూర్ లో సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేసి, ఆర్మీ వేధింపుల నుంచి విముక్తి కల్పించాలన్న డిమాండ్ తో షర్మిల నిరాహార దీక్ష చేశారు. కేవలం ముక్కుకు పైపుద్వారా ద్రవాహారం మాత్రమే తీసుకుని జీవితాన్ని ఆస్పత్రి పడకకు అంకితం చేశారు. ఇటీవల దీక్ష విరమించి, రాజకీయాల్లో ప్రవేశించిన ఆమెను మణిపూర్ ఎన్నికల్లో అక్కడి ప్రజలు దారుణంగా ఓడించారు. కేవలం 9ఓట్లే సాధించిన షర్మిల.. ఏకంగా సీఎంపైనే పోటీ చేయడం వల్లే ఓడారని విశ్లేషకులు అంటున్నారు.