Sharmila turned back without offering bonam to Ammavaru
mictv telugu

అమ్మవారికి బోనం సమర్పించకుండానే వెనుదిరిగిన షర్మిల.. వీడియో

July 25, 2022

తెలంగాణలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే పండుగల్లో బతుకమ్మ తర్వాత బోనాలు అని చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాదులో జరుపుకునే ఈ పండుగను ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేసిన పని విమర్శలకు తావిస్తోంది. మహిళలతో కలిసి బోనమెత్తిన షర్మిల.. పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి దేవాలయానికి బయల్దేరారు. కానీ, అమ్మవారికి బోనం సమర్పించలేదు. కనీసం ఆలయం లోపలకు రాలేదు. మధ్యలోనే వేరే మహిళకు బోనమిచ్చేశారు. సాధారణంగా బోనమెత్తిన మహిళ ఎవరైనా సరే ఎక్కడా దింపకుండా తీసుకెళ్లి ఆలయంలో అమ్మవారికి సమర్పిస్తారు. మధ్యలో దింపడం అపచారంగా భావిస్తారు. ఈ క్రమంలో షర్మిల తీరు వివాదాస్పదమైంది. పార్టీ పెట్టినప్పటి నుంచి తాను తెలంగాణ కోడలినని చెప్పుకునే షర్మిల.. పాదయాత్ర పేరుతో ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకగా భావించే బోనాల పండుగలలో పాల్గొనాలనుకోవడం ఇక్కడి మహిళలను ఆకట్టుకునేదే. కానీ, ఆచారానికి విరుద్ధంగా ప్రవర్తించడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యపై షర్మిల సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేస్తున్నారు. బోనాలు అనేది రాజకీయ నాయకులు ఫోటోషూట్ చేసుకునే వేదిక కాదని మండిపడుతున్నారు. ఆలయం లోపలికి వెళ్లే ఉద్దేశం లేనప్పుడు అసలు బోనం ఎందుకు ఎత్తుకోవాలని ప్రశ్నిస్తున్నారు.