Sharmila's challenge to KCR and KTR
mictv telugu

కేసీఆర్, కేటీఆర్‌లకు షర్మిల సవాల్..ముక్కు నేలకు రాస్తా

June 30, 2022

తెలంగాణ రాష్ట్రంలో గతకొన్ని నెలలుగా వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్రలో భాగంగా ఆమె తెలంగాణలోని ప్రజలు ఏఏ సమస్యలను ఎదుర్కొంటున్నారు? కేసీఆర్ పాలనలో ఏం కోరుకుంటున్నారు? అనే విషయాలపై ప్రజల స్పందనలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా షర్మిల కేసీఆర్, కేటీఆర్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

సూర్యాపేట జిల్లాలో బుధవారం ఆమె పాదయాత్ర చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ…‘తెలంగాణలో ప్రజా సమస్యలు ఉన్నాయి కాబట్టే పాదయాత్ర చేస్తున్నా. కావాలంటే కేసీఆర్, కేటీఆర్‌‌లు కలిసి ఒక్కరోజు నాతో పాదయాత్రకు రండి. సమస్యలు లేకుంటే ముక్కు నేలకు రాసి, మా ఇంటికి వెళ్లిపోతా. సమస్యలుంటే మీరు రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారా? కేసీఆర్‌ మోసం చేయని వర్గం ఏదైనా ఉందా? గాడిదకు రంగు పూసి ఆవు అని నమ్మించడమే కేసీఆర్‌ నైజం” అని ఆమె అన్నారు.

అనంతరం జగదీశ్‌రెడ్డిపై వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. స్కూటర్‌ మీద తిరిగే స్థానిక మంత్రి జగదీశ్‌రెడ్డి రూ.5వేల కోట్లు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు. ప్రతిపక్షం ప్రశ్నించడం మరిచి కేసీఆర్‌ సంకన ఎక్కిందని, మతపిచ్చి బీజేపీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి మోసం చేసిందని షర్మిల ఆరోపించారు.’నా గుండెలో నిజాయితీ, ప్రజలకు సేవ చేయాలని తపన చాలా ఉంది. ప్రజలంతా ఆశీర్వదిస్తే వైఎస్సార్‌ సంక్షేమ పాలనను మళ్లీ తీసుకొస్తా” అని ఆమె హామీ ఇచ్చారు.