హైదరాబాద్‌లో వేటకొడవళ్ల ఆట.. చెక్ పెట్టడం ఎలా? - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో వేటకొడవళ్ల ఆట.. చెక్ పెట్టడం ఎలా?

March 13, 2018

హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలోనే కాకుండా శాంతిభద్రత పరిరక్షణలోనూ ముందుకు దూసుకెళ్తోంది. ఆధునిక టెక్నాలజీ, అడుగడుగునా నిఘా, పటిష్టమైన కమ్యూనికేషన్ల వ్యవస్థలతో పోలీసులు సంఘ విద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నారు. గణేశ్ శోభాయాత్ర నుంచి మొహరం ఊరేగింపుల వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరక్కుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ప్రధాని, రాష్ట్రపతి పర్యటనల నుంచి విదేశీ ప్రతినిధుల భద్రత వరకు అన్న నిరాటకంగా సాగుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో వేళ్లూనుకున్న పగలు, ప్రతీకారాలను మాత్రం పోలీసులు పసిగట్టలేకపోతున్నారు. వీటికి ఆయుధబలం కూడా తోడుకావడంతో నగరంలో నేరాలు కొనసాగుతూనే ఉన్నాయి.

నడిరోడ్డుపై..

కూకట్‌పల్లిలో సోమవారం సుధీర్ అనే ఇంటర్ విద్యార్థిని అతని ప్రత్యర్థులు నడిరోడ్డుపై వేటకొడవళ్లతో వెంటాడి వేటాడి మరీ నరికి చంపేశారు. జనతానగర్ బస్తీ గొడవ ముదిరిపోయి ఈ హత్యకు దారితీసింది. మోటార్ బైక్‌పై వెళ్తున్న సుధీర్ హంతకుల బారి నుంచి తప్పించుకోవడానికి బస్సు ఎక్కాడు. అయినా వారు బస్సు ఎక్కి అతణ్ని కిందికి ఈడ్చుకొచ్చి చంపేశారు. రోడ్డుపై వెళ్తున్న హోంగార్డ్ ఒక నిందితుణ్ని పట్టుకోగలిగాడు. ఈ ఘోరంతో నగరం నివ్వెరపోయింది.

వేడకొడవళ్లే ఎందుకు?

అమెరికాలో ఇంటికి రెండు మూడు లైసెన్స్ తుపాకులు ఉంటాయి. శాంతిభద్రత కోణంలో అక్కడి అధికారులు ప్రజలకు విరివిగా లైసెన్సులు మంజూరు చేస్తుంటారు. అయితే మన దేశంలో పరిస్థితివేరు. ప్రాణాలకు ముప్పు ఉందనో, లేకపోతే ఇతరత్రా గట్టి కారణాలో చూపితేగాని లైసెన్స్ తుపాకీలు ఇవ్వరు. సెలబ్రిటీలు, వ్యాపారులు, రాజకీయ నాయకులు వంటి హైప్రొఫైల్ బాబులకే లైసెన్సులు అందుతున్నాయి. ఫలితంగా ఆత్మరక్షణ కోసం, లేకపోతే ఇతరులపై దాడి చేయడానికి నేరస్తులు ప్రత్యామ్నాయంవైపు దృష్టిసారిస్తున్నారు. వీరికి వేటకొడవళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. సుధీర్‌ను చంపడానికి వాడిని వేటకొడవళ్లను వివేకానంద నగర్ చౌరస్తాలో కొన్నట్లు పోలీసులు తెలిపారు. కోఠి, పాతబస్తీ, నగర శివారు ప్రాంతాల్లోనూ ఇవి అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు.

తయారీ సులభం..

వేటకొడవళ్ల తయారీ కార్ఖానా, భారీస్థాయిలో పెట్టుబడులు అక్కర్లేదు. కొలిమి, కూలీలు, కాస్త స్థలం ఉంటే చాలు. డిమాండ్‌ను బట్టి తయారు చేస్తే సరిపోతుంది. హైదరాబాద్‌లో పెనాలు, కొడవళ్లు వంటి సాగుపనిముట్లు తయారు చేసేవారిలో కొందరు వేటకొడవళ్లను కూడా తయారు చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మాంసం వ్యాపారులు, కొబ్బరిబోండాల వ్యాపారులు వీటిని కొనుగోలు చేస్తుంటారు. తాముకూడా ఈ వ్యాపారులు చేస్తున్నామంటూ యువకులు సులభంగా వీటిని కొనేస్తున్నారు.

అడ్డుకట్టవేసేదెలా?

దాదాపు 80 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్‌లో ఏ మూల ఏం జరుగుతోందో కనిపెట్టడం కష్టం. ఎన్ని కెమెరాలు ఉన్నా, ఇళ్లలో గుట్టుచప్పుడుకాకుండా జరిగే పనులను పోలీసులు పసిగట్టలేరు. అయితే కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మారణాయుధాల తయారీని అరికట్టొచ్చు. ఇనుము, ఇతర కొలిమి పరికరాల డీలర్లు, వ్యాపారులకు సమస్యలను వివరించడం, అనుమానం ఉన్న వ్యక్తులు వివరాలను సేకరించడం, సమస్యాత్మక ప్రాంతాల్లో తరచూ తనిఖీల నిర్వహణ, నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చేయడం  తదితర చర్యలతో కొంతవరకైనా అడ్డుకట్ట వేయొచ్చు. బస్తీల్లో గ్యాంగ్‌వార్లు ఉంటే, ఇరుపక్షాల వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం, జీవనోపాధి, విద్య తదితర కనీస సదుపాయాల కల్పనతో శాంతిని సాధించొచ్చు.