ఏపీలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. వరద నీరు ఎక్కువగా వస్తుండటంతో తీర ప్రాంతాలు కోతకు గురౌతున్నాయి. పలు ఇళ్లలోకి ఇప్పటికే భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ ప్రభావం హీరో శర్వానంద్ తాతయ్య ఇంటికి కూడా తాకింది. మైనేని హరిప్రసాద్ ఇల్లు ఉధృతికి కొట్టుకుపోయింది. నది పక్కనే దీన్ని నిర్మించడంతో పునాది కదిలిపోవడంతో అందులో కలిసిపోయింది. ఇది పాతకాలం నాటిది కావడంతో ప్రస్తుతం అందులో ఎవరూ ఉండటం లేదు. గతేడాది కూడా ఆయన ముత్తాత ఇల్లు కూడా ఇలాగే వరద నీటిలో కొట్టుకొని పోయిన సంగతి తెలిసిందే.
భారత అణు శాస్త్రవేత్తగా పని చేసిన డాక్టర్ మైనేని హరిప్రసాద్ కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తే. అందుకే ఆయన అవనిగడ్డ సమీపంలో నది ఒడ్డున ఓ పెంకుటిల్లు నిర్మించుకున్నారు. ఎప్పుడైనా ఏపీకి వచ్చినప్పుడు కచ్చితంగా శర్వానంద్ ఈ ఇంటిలో బస చేస్తూ ఉంటారు. కానీ ఈ ఏడాది వరద కారణంగా అది కొట్టుకుపోయింది. ఇల్లు నదిలో కలిసిపోతుండటం చూసి స్థానికులు ఆవేదన చెందారు. కాగా, కృష్ణా వరద కారణంగా పలు లంక గ్రామాలు నీటితో నిండిపోయాయి. ప్రజలు అవస్థలు పడుతున్నారు. అధికారులు ముందు జాగ్రత్తగా సహయక చర్యలకు సిద్ధం అయ్యారు.