'తిక్కరేగిందంటే ఎవరినీ లెక్క చేయను'.. శర్వానంద్ సీరియస్ వార్నింగ్
గమ్యం, ప్రస్థానం, రన్ రాజా రన్, శతమానం భవతి, జాను వంటి విలక్షణమైన కథా నేపథ్యమున్న చిత్రాలలో నటిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు హీరో శర్వానంద్. జాను సినిమా తర్వాత బరువు పెరిగిన శర్వానంద్ ఇపుడు మళ్లీ స్లిమ్‌గా పాత లుక్‌లోకి మారిపోయాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. టైం ట్రావెల్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీ కార్తీక్ తెరకెక్కించారు. సెప్టెంబర్ 9న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. అమల అక్కినేని, నాజర్ ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఈ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో శర్వానంద్ బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూలో ఆయన ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు.
ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్లని శర్వానంద్ ఓ నిర్మాతపై ఆరోపణలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. సినిమా విడుదలై మంచి బిజినెస్ జరిగినప్పటికీ తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ పూర్తిగా ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. నిర్మాతలు తనతో నిజాయతీగా ఉంటే తాను కూడా అలాగే ఉంటానని, మోసం చేయాలని చూస్తే ఏ మాత్రం సహించబోనని అన్నారు.
‘‘ కొన్ని రోజులుగా ఓ నిర్మాత నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సినిమా పారితోషకం తగ్గించుకోనని, నిర్మొహమాటంగా మాట్లాడుతానని చెబుతున్నాడు. నిజం మాట్లాడాలంటే రెమ్యునరేషన్ ఎందుకు తగ్గించుకోవాలి. నా మార్కెట్‌ను బట్టి నిర్మాతలు ఇచ్చే రెమ్యునరేషన్ అది. దాన్ని ఇంకా తగ్గించుకోవాలని చెబుతున్నాడు. మనకు ఆస్థి ఉంది. ఎందుకీ కష్టాలు అని నా పేరెంట్స్ ఎప్పుడూ చెప్పలేదు. నీ కాళ్ల మీద నువ్వు ఎదగాలని చెప్పే పెంచారు. 19 ఏళ్ల నుంచి అదే పని చేస్తున్నాను. వాళ్ల దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోలేదు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఆ నిర్మాత నన్ను మోసం చేశాడు. అతను నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదు. అయినా నేను డబ్బింగ్ చెప్పాను. ఆ సినిమా వల్ల ఆయనకు ఎంత లాభం వచ్చిందో నాకు తెలుసు. నన్ను మోసం చేస్తే సహించలేను. తిక్కరేగిందంటే ఎవరినీ లెక్క చేయను’’ అన్నారు.