Shashi Tharoor Alleges "Damning" Evidence Of Rigging In Congress Election
mictv telugu

మరికాసేపట్లో అధ్యక్ష ఎన్నికల రిజల్ట్స్.. శశిథరూర్ సంచలన కామెంట్స్

October 19, 2022

మరికొన్ని గంటల్లో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని చేపట్టబోయేది ఎవరన్నది తేలనుంది. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఆరోసారి అధ్యక్ష పదవికి సోమవారం ఎన్నికలు జరిగాయి. మొత్తం 9915 మంది ప్రతినిధుల్లో 9500 మంది మాత్రమే ఓటేశారు. ప్రదేవ్ కాంగ్రెస్‌ కమిటీ ప్రతినిధులు వేసిన ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ ఆధ్వర్యంలో ఈ లెక్కింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో.. అధ్యక్ష పదవికై పోటీ చేసిన అభ్యర్థి శశిథరూర్‌ ఎన్నికల ప్రక్రియపై కీలక ఆరోపణలు చేశారు. అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యంత తీవ్రమైన అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ మేరకు థరూర్‌ బృందం.. కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీకి బుధవారం లేఖ రాసింది.

ఓవైపు అధ్యక్ష ఎన్నిక ఫలితాల కోసం కౌటింగ్‌ జరుగుతుండగా.. థరూర్‌ ఈ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పోలింగ్‌ సమయంలో కొన్ని రాష్ట్రాల్లో తప్పులు జరిగాయని, దీని గురించి మిస్త్రీ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లేందుకు చాలాసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నారు థరూర్. అందుకే లెటర్ రాయాల్సి వచ్చిందంటూ… యూపీలో ఎన్నికల నిర్వహణలో విశ్వసనీయత, సమగ్రత లోపించడం విచారకరమని పేర్కొన్నారు.

“ ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో ఖర్గే మద్దతుదారులు అక్రమాలకు పాల్పడ్డారన్న విషయం ఆయనకు తెలియకపోవచ్చు. తెలిస్తే ఆయన అలా జరగనిచ్చేవారు కాదు. ఆ రాష్ట్రంలో బ్యాలెట్‌ బాక్సులకు అధికారిక సీల్‌ వేయలేదు. పోలింగ్‌ కేంద్రాల వద్ద అనధికారిక వ్యక్తులు కూడా ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ అవకతవకలపై చర్యలు తీసుకోకపోతే ఈ ఎన్నిక ప్రక్రియ స్వేచ్ఛగా, న్యాయంగా ఎలా జరిగినట్లు అవుతుంది? అందువల్ల ఆ రాష్ట్రంలోని ఓట్లన్నింటినీ చెల్లనివిగా పరిగణించాలని మేం డిమాండ్‌ చేస్తున్నాం’’ థరూర్‌ తరఫున ఎన్నికల ఏజెంట్‌గా ఉన్న సల్మాన్‌ సోజ్‌ లేఖలో పేర్కొన్నారు.