ఖలిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేసి శౌర్యచక్ర అవార్డు అందుకున్న బల్విందర్ సింగ్ భిక్విండ్ (63)ను దుండగులు కాల్చి చంపారు. శుక్రవారం ఉదయం బైక్పై వచ్చి విచక్షణా రహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. ఈ సంఘటనలో అతడి శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే ఆయన తన భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టారు. ఉగ్రవాదులే పగబట్టి పక్కా ప్రణాళిక ప్రకారం ఈ దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
బల్విందర్ సింగ్ పంజాబ్లోని తరన్ తరాన్ జిల్లాలోని తన గ్రామంలో ఏర్పాటు చేసిన పాఠశాల వెలుపల అతని కోసం వేచి ఉన్నారు. అక్కడికి వచ్చి గేట్ తెరిచిన వెంటనే కాల్పులు జరిపారు. కాల్పుల శబ్ధం విన్న గ్రామస్తులు వచ్చేసరికి వారు పారిపోయారు. ఐదు బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోవడంతో ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న బల్విందర్ సిక్కు యువత మతపరమైన ఉగ్రవాదం వైపు వెళ్లకుండా పని చేశారు. వారికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఖలిస్తాన్ ఉగ్రవాదం తీవ్ర ఎక్కువగా ఉన్న సమయంలో నిలువరించే ప్రయత్నం చేశారు. దీని కోసం తన కుటుంబానికి ఆయుధాల ఉపయోగంలో శిక్షణ కూడా ఇచ్చారు. ఎన్నోసార్లు ఆయనపై ఉగ్రవాద దాడి జరిగింది. ప్రతిసారి సమర్థవంతంగా తిప్పికొట్టారు. మొదటి దాడి 1990 జనవరి 31న జరిగింది. ఆ తర్వాత అదే ఏడాది సెప్టెంబర్ 30న ఘోరమైన దాడి జరిగింది. 200 మంది సాయుధులు అతడి ఇంటిని చుట్టుముట్టి రాకెట్ లాంచర్లను ప్రయోగించారు. 2017లో మరోసారి చంపేందుకు ప్రయత్నించారు. వీటన్నింటిని తట్టుకున్న ఆయనకు శౌర్య చక్ర అవార్డు ఇచ్చారు. ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాటు చేసింది. కానీ ఇటీవలే భద్రతను ఉపసంహరించుకోవడంతో అదును చూసి చంపేశారు.