‘ట్రిపుల్’పై ఈమెతోనే పోరు షురూ - MicTv.in - Telugu News
mictv telugu

‘ట్రిపుల్’పై ఈమెతోనే పోరు షురూ

August 22, 2017

షాయరా బానో.. ఉత్తరాఖండ్ కు చెందిన ముస్లిం మహిళ. ఒక స్త్రీగా ఎన్ని కష్టాలు అనుభవించాలో అన్నీ అనుభవించింది. అత్తింటివారు కట్నం కోసం ఆమెను వేధించారు. లక్షల నగదు, కారును కట్నంగా ఇచ్చినా తృప్తి పడకుండా అవి తేవాలి, ఇవి తేవాలి అని వేధించారు.  మానసికంగా, శారీరకంగా గాయపరిచారు. చిత్రవధ చేశారు.  ఆరుసార్లు బలవంతంగా గర్భస్రావం చేయించారు. పుట్టింటివారిని కలుసుకోకుండా అమెపై కఠిన ఆంక్షలు విధించారు.

అయినా షాయరా అన్నీ ఓపిగ్గా ఓర్చుకుంది. 15 ఏళ్ల వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి బాధలను మౌనంగా భరించింది. తన ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం అత్తింట్లోనే నానా కష్టాలు పడింది. అయినా భర్తకు ఆమెపై కనికరం కలగలేదు. ఒక్క టెలిగ్రామ్ తో ట్రిపుల్ తలాక్ చెప్పేసి విడాకులు తీసుకున్నాడు. పిల్లలను కూడా ఆమెకు దూరం చేశాడు.

కొన్నాళ్లు దు:ఖంతో పొగిలిపొగిలి రోదించింది షాయరా. కానీ త్వరలోనే గుండె దిటవు చేసుకుంది. తనకు జరిగిన అన్యాయం మరో మహిళకు జరగకూడదని నిర్ణయించుకుంది. అన్యాయంగా ట్రిపుల్ తలాక్ చెప్పేసి పెళ్లి బంధాన్ని తెంచేసుకోవడానికి వీలు కల్పించే ట్రిపుల్ తలాక్ పై సమర శంఖం పూరించింది.

ఈ సంప్రదాయాన్ని నిషేధించాలని 2015లో సుప్రీం కోర్టులో తొలి పిటిషన్ వేసింది. తర్వాత మరెందరో ముస్లిం మహిళలు ఇలాంటి పిటిషన్లు వేశారు. ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వెనక షాయరా పడిన కష్టాలు, ఆమె పోరాటం ఉంది. ట్రిపుల్ తలాక్ తో బహుభార్యత్వంపై ఆమె పోరాడుతోంది.

‘‘నా దగ్గర డబ్బులేదు. నా పిల్లలను నాకు దూరం చేశారు. దారుణమైన కష్టాలు అనుభవించాను. అయినా నేను పోరాడాను. మిగతా మహిళలు కూడా పోరాడాలి.. ’’ అని షాయరా అంటున్నారు.