టాలీవుడ్లో ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో మెయిన్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తే, కీలక పాత్రలో ఆయన తనయుడు మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. సినిమా ఓ రేంజ్లో ఉండబోతున్నది అని, సినిమాను ఎప్పుడెప్పుడు వీక్షించాలని ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో చిత్రబృందం సినిమాను దేశవ్యాప్తంగా ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్స్, ట్రైలర్, పాటలు విడుదలయ్యాయి. అయితే, సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ కొరటాల శివ.. హీరోయిన్ కాజల్ అభిమానులకు భారీ షాక్ ఇచ్చారు. గతంలో ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే నటిస్తోందంటూ మేకర్స్ ప్రకటించింది. ఈ మేరకు కాజల్ లుక్ను కూడా రిలీజ్ చేశారు.
అయితే, ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి అందులో కాజల్ అగర్వాల్ మిస్ అయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ఎవరూ ఆమె పేరును కూడా ఎత్తకపోవడం ఆ అనుమానాలకు బలాన్ని చేకూర్చింది. రాంచరణ్ని ఈ విషయం అడిగితే, తాను ఫైనల్ కట్ చూడలేదంటూ సమాధానం చెప్పాడు. కానీ, తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాలో కాజల్ పాత్ర లేదంటూ బాంబ్ పేల్చారు.