ఆమె వయసు 54 ఏళ్లు, 30 ఏళ్ల అమ్మాయిగా తయారై..చివరికి - MicTv.in - Telugu News
mictv telugu

ఆమె వయసు 54 ఏళ్లు, 30 ఏళ్ల అమ్మాయిగా తయారై..చివరికి

July 5, 2022

తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇంద్రాణిని అనే మహిళను తిరుపతికి చెందిన శరణ్య అనే 54 ఏళ్ల మహిళ పెళ్లి పేరుతో దారుణంగా మోసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మీ అబ్బాయిని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారని కబురుపంపి, పెళ్లి చూపులకు వచ్చిన వారికి తన వయసు 30ఏళ్లని చెప్పి, వివాహమైన అనంతరం ఆ వ్యక్తిని, అతని తల్లిని డబ్బుల కోసం చిత్రహింసలు పెట్టి, చివరికి కటకటలాపాలైన సంఘటన కలకలం రేపింది. మరి 54 ఏళ్ల వయసున్న ఆ మహిళ, 30 ఏళ్ల వయసున్న యువతిగా ఎలా మారింది? ఆమెకు ఇదివరకే పెళ్లి అయ్యిందా? ఎందుకిలా ఆ మహిళ ఈ వయసులో ఈ దారుణానికి పాల్పడింది? అనే పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లా పుదుప్పేటకు చెందిన ఇంద్రాణి తన కుమారుడితో కలిసి గతకొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటుంది. ఆమె కొడుకు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి పెళ్లై విడాకులు కూడా తీసుకున్నాడు. అయితే, అతనికి రెండవ పెళ్లి చెయ్యాలని ఇంద్రాణి గత ఆరు నెలలుగా సంబంధాలు వెతుకుతుంది. ఈ క్రమంలో తిరుపతికి చెందిన శరణ్య అనే మహిళ (పెళ్లిళ్ల బ్రోకర్) పరిచయమైంది. తన కొడుకుకు రెండవ పెళ్లి చేయాలని అనుకుంటున్నానని, సంబంధాలు ఉంటే చెప్పండి అని ఇంద్రాణి శరణ్యకి చెప్పింది.

ఈ క్రమంలో శరణ్య ఓ ప్లాన్ వేసింది. ఇంద్రాణికి ఫోన్ చేసి మీ అబ్బాయిని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారని కబురు పంపింది. శరణ్య వయస్సు అప్పటికే 54ఏళ్లు. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో విడాకులు తీసుకొని, పెళ్లిళ్ల బ్రోకర్‌గా విధులు నిర్వహిస్తుంది. అయితే, శరణ్య భారీగా మేకప్ వేసుకుని 30 సంవత్సరాల వయసున్న అమ్మాయిలా తయారై, వారి ముందు కూర్చుంది. దాంతో ఆ అమ్మాయి ఇంద్రాణి కుమారుడికి నచ్చడంతో పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నారు. తిరువళ్లూరులో భారీగా ఖర్చు చేసి, పెళ్లి కూడా చేశారు. ఆమెకు ఇరవై ఐదు సవర్ల బంగారాన్ని ఎదురిచ్చి మరీ పెళ్లి చేసుకున్నారు. తీరా పెళ్లి చేసిన తరువాత ఆమె తన అసలు రూపం బయటపెట్టింది.

అత్తా, భర్తను వేధించటం మొదలుపట్టింది. శాలరీ మొత్తం తన చేతిలోనే పెట్టాలని, బీరువా తాళాలను తన చేతికే ఇవ్వాలని, ఆస్తులను కూడా తన పేరు మీదకే రాయాలి రోజు గొడవపడటం స్టార్ట్ చేసింది. దాంతో భర్త ఆమె పోరు పడలేక ఆస్తి రాయిద్దామని ఆధార్ కార్డు ఇవ్వాలని కోరాడు. ఇక అంతే, ఆధార్ కార్డులో ఉన్న కేరాఫ్ అడ్రస్ చూసి షాక్ అయ్యాడు. ఆమెకు రవి అనే వ్యక్తితో పెళ్లి అయ్యిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఆమె వయసు 54ఏళ్లని తెలుసుకున్నాడు. తల్లి, అతడు కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో శరణ్య అసలు కథ బయపడింది.

”ఆర్ధిక ఇక్కట్లతో పెళ్లిళ్ల బ్రోకర్‌ను సంప్రదించి యువకులను మోసం చేసి డబ్బు గుంజుతోంది. ఈ క్రమంలోనే సుబ్రమణి అనే వ్యక్తికి సంధ్యగా పరిచయమై పదకొండు సంవత్సరాలు కాపురం చేసింది. ఆ తరువాత కరోనా సమయంలో తల్లి వద్దకు వెళ్లి వస్తానని చెప్పి.. తిరిగి రాకుండా అక్కడనుంచి తప్పించుకుంది. ఇంతలోనే ఇంద్రాణి కుమారుడి గురించి కూడా తెలియడంతో తనకింకా పెళ్లి కాలేదని చెప్పి తన పేరు శరణ్యగా పరిచయం చేసుకుని ఇంత కథ నడిపించింది.” అని పోలీసులు వివరాలను వెల్లడించారు.