భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో కోచ్‌ను మార్చేయాలని భావించింది. ఆమె నిర్ణయం మేరకు సింధు వ్యక్తిగత కోచ్, దక్షిణ కొరియాకు చెందిన పార్క్ టి సాంగ్ తన సేవలకు గుడ్ బై చెప్పేశాడు. ఈ విషయాన్ని పార్క్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. వచ్చే ఒలింపిక్స్ వరకు సింధుతో ఉండలేకపోతున్నందుకు క్షమించాలని కోరాడు. ఆమె నిర్ణయం మేరకు వ్యక్తిగత కోచ్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపాడు. ఇటీవల సింధు నిరాశజనక ప్రదర్శనకు బాధ్యత వహిస్తున్నట్లు పార్క్ పేర్కొన్నాడు. 2019 నుంచి సింధుకు పార్క్ సిందుకు కోచ్‌గా ఉన్నాడు. అతడి కోచింగ్‌లోనే సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిచింది. మూడు బీడబ్ల్యూఎఫ్ టైటిల్స్‌ను కూడా అందుకుంది.
ఇటీవల గాయం కారణంగా 5 నెలల ఆటకు దూరంగా ఉన్న సింధు..పునరాగమనంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. మలేషియా ఓపెన్, ఇండియా ఓపెన్ లోనూ మొదటి రౌండ్ లోనే ఇంటి ముఖం పట్టింది. ఆసియా మిక్స్ డ్ ఈవెంట్ లోనూ ర్యాంకింగ్స్ లో తనకంటే దిగువన ఉన్న గావో ఫాంగ్ జి చేతిలో ఓడి నిరాశపర్చింది. దీంతో కోచ్‌ను మార్చేయాలని సింధు భావించినట్లు తెలుస్తోంది.