పాక్ నూతన ప్రధానిగా షెహబాజ్ ఎన్నిక.. బెయిల్ పొడగింపు - MicTv.in - Telugu News
mictv telugu

పాక్ నూతన ప్రధానిగా షెహబాజ్ ఎన్నిక.. బెయిల్ పొడగింపు

April 11, 2022

fbfdbfd

పాకిస్తాన్ కొత్త ప్రధాన మంత్రిగా పాకిస్తాన్ ముస్లిం లీగ్ – నవాజ్ షరీష్ (పీఎంఎల్ – ఎన్) అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ (70) ఎన్నికయ్యారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ తరపున నామినేషన్ వేసిన షా మొహమ్మద్ ఖురేషీ తన అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకోవడంతో షరీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ నుంచి షరీఫ్‌కు సంపూర్ణ మద్దతు లభించింది. నేడు మధ్యాహ్నం జాతీయ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై కొత్త ప్రధానిని ఎన్నుకున్నారు. ఈ రోజు రాత్రికి దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ కొత్త ప్రధానిచే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇదిలా ఉండగా, ప్రధాని ఎన్నికను ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పీటీఐ సభ్యులు బహిష్కరించారు. జాతీయ అసెంబ్లీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో దొంగలు, బిచ్చగాళ్లతో కలిసి అసెంబ్లీలో కూర్చోలేనంటూ ఇమ్రాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్‌, ఆయన కుమారుడిపై ఉన్న మనీ లాండరింగ్ కేసులో కోర్టు తీర్పు ఊరటనిచ్చింది. కోర్టుకు స్వయంగా హాజరుతో పాటు అరెస్టుకు సంబంధించి ముందస్తు బెయిల్‌ను న్యాయస్థానం పొడగించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేయడంతో షరీఫ్‌కు ప్రధాని పదవి చేపట్టడానికి అడ్డులేకుండా పోయింది. కాగా, పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఉన్న షహబాజ్ షరీఫ్ ఇప్పుడు ప్రధాని పదవి చేపట్టనుండడంతో ఆయన కుమారుడు హమ్జా షెహబాజ్‌ను పంజాబ్ ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉంది.