భారత క్రికెట్ వికెట్ కీపర్ కం బ్యాటర్ షెల్డన్ జాక్సన్ దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నా జాతీయ జట్టుకు ఎంపిక కావట్లేదు. 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లను టీమిండియాకు ఎంపిక చేయట్లేదని తనకు ఓ సెలక్షన్‌కు సంబంధించిన ఓ అధికారి చెప్పినట్లు పేర్కొన్న జాక్సన్.. వయసును సాకుగా చూపి భారత సెలక్టర్లు డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తాడు. దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నా తనను టీమిండియాకు ఎందుకు ఎంపిక చేయట్లేదో అర్ధం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
తనను టెస్ట్‌లకు ఎంపిక చేయకపోవడంపై మాట్లాడుతూ.. 30ఏళ్లు పైబడిన వారు ఎవరినీ ఎంపిక చేయడం లేదని చెప్పారు. చట్టంలో 30 ఏళ్లు పైబడిన వారిని టీమిండియాకు ఎంపిక చేయకూడదనే నిబంధన ఏదైనా ఉందా అని ప్రశ్నించాడు. తన ముందే 32, 33ఏళ్ల మధ్య ఉన్న వ్యక్తిని ఎంపిక చేసుకున్న విషయాన్ని తెలిపాడు. ప్రతి ఒక్క క్రికెటర్‌కు భారత జట్టుకు ఆడాలన్నది ఓ కల అని, దాన్ని సాకారం చేసుకునేందుకే ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారని అన్నాడు. సెలక్టర్ల నుంచి పిలుపు అందే వరకు తన ప్రయత్నాలను విరమించేదేలేదని చెప్పుకొచ్చాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో 50కంటే ఎక్కువ సగటును మెయింటెన్ చేశాడు జాక్సన్. 79ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 50.4సగటుతో 5,947పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్లలో 10,000పరుగులకు దరిదాపుల్లో ఉన్నాడు.