కాపరికి కరోనా.. గొర్రెలు, మేకలు క్వారంటైన్‌కు - MicTv.in - Telugu News
mictv telugu

కాపరికి కరోనా.. గొర్రెలు, మేకలు క్వారంటైన్‌కు

June 30, 2020

Karnataka.

కరోనా వైరస్ ఉచ్చు ఇప్పుడు గొర్రెలు, మేకల మెడకు కూడా చుట్టుకుంది. పాపం నోరులేని జీవాలు కూడా కరోనాకు టార్గెట్ అవడం బాధాకరం. ఒక్కరికి కరోనా సోకితే అది ఎంతమందికి పాకుతుందో? చెప్పడం కష్టంగా మారింది. గొర్రెలు, మేకలు కాచుకునే కాపరికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో పశుసంవర్థక అధికారులు అప్రమత్తం అయ్యారు. అతని వద్ద ఉన్న దాదాపు 50 మేకలు, గొర్రెలను క్వారంటైన్‌కు తరలించారు. ఈ ఆశ్చర్యకర ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని గోడేకేరి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో గొర్రెల కాపరి గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో అతను పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే అతను మేపుతున్న పలు మేకలు, గొర్రెలు శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్లు గ్రామస్తులు గమనించారు. 

వెంటనే ఈ విషయాన్ని తుమకూరు జిల్లా ఇన్‌ఛార్జీ, న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి ఆదేశాల అనుసారం పశుసంవర్థకశాఖ అధికారులు గ్రామానికి చేరుకున్నారు. గొర్రెలు, మేకల నుంచి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపారు. అయితే మేకలు, గొర్రెలు ప్లేగు వ్యాధి(జ్వరం, నోటిలో పుండ్లు, విరేచనాలు, న్యూమోనియా, కొన్నిసార్లు మరణం సంభవించడం)తో బాధ పడుతున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. శాంపిల్స్‌ను భోపాల్‌లోని పరిశోధన శాలకు పంపారు. ప్రాథమిక సమాచారం మేరకు గొర్రెలు, మేకలకు కరోనా సోకలేదని తెలిపారు. అయినప్పటికి సదరు మేకలు, గొర్రెలను క్వారంటైన్‌కు తరలించినట్లు అధికారులు స్పష్టంచేశారు. వాటిని క్వారంటైన్‌కు తరలించడానికి కారణం.. మేక ప్లేగు వ్యాధి సైతం అంటువ్యాధేనని చెప్పారు. ఇతర జంతువులకు సోకకుండా ఉండేందుకు వీటిని క్వారంటైన్‌కు తరలించినట్లు తెలిపారు.