ప్రజ్ఞాసింగ్ సారీ చెప్పాలి.. కేటీఆర్, అసద్.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రజ్ఞాసింగ్ సారీ చెప్పాలి.. కేటీఆర్, అసద్..

May 16, 2019

మ‌హాత్మాగాంధీని హ‌త్య చేసిన నాథూరామ్ గాడ్సే దేశభ‌క్తుడని మాలేగావ్‌ పేలుళ్ల కేసు నిందితురాలు, భోపాల్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పలువురు నేతలు ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. గతంలో, భవిష్యత్తులోనూ గాడ్సే దేశభక్తుడిగానే ఉంటారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు గర్హనీయమన్నారు కేటీఆర్‌. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు యావత్‌ భారత జాతికి ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. రాజకీయంగా ఎంత వైరుధ్యమున్నా హద్దులు దాటి మాట్లాడకూడదని అన్నారు.

 

గాడ్సే పేరును భారతరత్నకు సిఫారసు చేసినా చేస్తారు..

ఆమె వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ఘాటుగా స్పందించారు. ‘ఇదేదో పిచ్చితనంతో చేసిన వ్యాఖ్యలు కావు. ఆమె వ్యక్తిగత అభిప్రాయం అసలూ కాదు. స్వతంత్ర భారతదేశపు మొదటి ఉగ్రవాదిపై బీజేపీ వైఖరినే సాధ్వీ ప్రజ్ఞ వెల్లడించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని బీజేపీ వెనకేసుకువస్తోంది. ఆమె అభ్యర్థిత్వాన్ని కూడా నరేంద్ర మోదీ బలపరుస్తున్నారు. మరి కొన్నేళ్లలో వీళ్లు శ్రీ గాడ్సే గారి పేరు భారతరత్న అవార్డుకు కూడా సిఫారసు చేసినా చేస్తారు… చూస్తూ ఉండండి’ అని ట్వీట్ చేశారు.

ఇదిలావుండగా ఆమె వ్యాఖ్యల్ని జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా సైతం ఖండించారు. మరోవైపు, ప్రజ్ఞాసింగ్‌ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ఈ అంశంపై ఆమెను వివరణ కోరనున్నట్టు ఆ పార్టీ నేత జీవీఎల్‌ నరసింహారావు చెప్పారు. ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యుం పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌ హాసన్‌ ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తూ..‘స్వతంత్ర భారత తొలి ఉగ్రవాది హిందూనే’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.